జనసేనాని పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా, పార్టీ యంత్రాంగాన్ని పరుగులెత్తిస్తున్న మాస్టర్ మైండ్ గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆయనే రామ్ తాళ్లూరి. జనసేన పార్టీకి ఆయన కేవలం ప్రధాన కార్యదర్శి మాత్రమే కాదు.. ఇప్పుడు పార్టీలో వస్తున్న మార్పుల వెనుక ఉన్న అసలైన సిస్టమ్ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ బాధ్యతల్లో బిజీగా ఉండటంతో, పార్టీ కార్యకర్తలు ఎవరిని కలవాలి? తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో రామ్ తాళ్లూరి ఒక ట్రబుల్ షూటర్ లా రంగంలోకి దిగారు. కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఒక వారధిలా పనిచేస్తున్నారు. గతంలో జనసేన అంటే కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉండే అభిమానం మాత్రమే అని అందరూ అనుకునేవారు. కానీ, రామ్ తాళ్లూరి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఒక కార్పొరేట్ తరహా క్రమశిక్షణ కనిపిస్తోంది.
నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి సాగుతున్న అంతర్గత విభేదాలను ఆయన చకచకా పరిష్కరిస్తున్నారు. ఎవరో చెప్పిన మాటలు విని కాకుండా, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడి, గతంలో గుర్తింపు పొందని నిజమైన సైనికులను గుర్తించి వారికి పదవులు ఇస్తున్నారు. పైరవీలకు తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉంటూ, గ్రామీణ స్థాయి నాయకులతో కూడా నేరుగా మాట్లాడుతున్నారు. ఇది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
అసలెవరీ రామ్ తాళ్లూరి..?
రామ్ తాళ్లూరి రాజకీయాల్లోకి రాకముందు ఐటి రంగంలో తిరుగులేని పారిశ్రామికవేత్త. అమెరికాలో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలను స్థాపించి సక్సెస్ అయ్యారు. కేవలం ఐటి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్, హోటల్ రంగాల్లో కూడా ఆయనకు వ్యాపార సామ్రాజ్యం ఉంది. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో రామ్ ఒక ప్రముఖ నిర్మాత. `చుట్టాలబ్బాయి`, `నేల టిక్కెట్`, `డిస్కో రాజా`, `కిలాడి` తదితర చిత్రాలను నిర్మించారు. మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ, ఎలాంటి ప్రచారం కోరుకోకుండా తెర వెనుక ఉండి పార్టీకి వెన్నుముకగా నిలిచారు. పవన్ కళ్యాణ్‌తో రామ్ తాళ్లూరికి ఉన్న అనుబంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాదు, వ్యక్తిగతంగా కూడా వారిద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తన వ్యాపారాలను, ఇతర పనులను పక్కన పెట్టి ఇప్పుడు తన పూర్తి సమయాన్ని పార్టీ నిర్మాణానికి కేటాయిస్తున్నారు.