రాష్ట్ర రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమరావతి నదీ పరివాహక ప్రాంతమని, అక్కడ నిర్మాణాలు సరికాదని జగన్ చేసిన వాదనను టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తనదైన శైలిలో తిప్పికొట్టారు. జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అశాస్త్రీయతను ప్రపంచ చరిత్రను ఉదాహరణగా చూపుతూ ఆయన గాలి తీసేశారు.
రాజ్యాంగంలో `క్యాపిటల్` అనే పదమే లేదని జగన్ అనడంపై యనమల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ఆయన అజ్ఞానానికి నిదర్శనమని, రాజధాని విషయంలో జగన్ తీవ్ర గందరగోళంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి 33 వేల ఎకరాలు కావాలన్న జగన్, అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ మాట మార్చారని.. ఇప్పుడు మళ్ళీ కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.
నదీ తీరంలో రాజధాని ఉండకూడదన్న జగన్ వాదనపై యనమల గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాలు, జాతీయ రాజధానులన్నీ నదీ తీరాల్లోనే వెలిశాయని గుర్తు చేశారు. లండన్ (థేమ్స్ నది), పారిస్ (సైన్ నది), వాషింగ్టన్ డీసీ (పోటోమాక్) వంటి నగరాలు నదీ తీరాన ఉండబట్టే అంతర్జాతీయంగా వాణిజ్య, రవాణా కేంద్రాలుగా మారాయని వివరించారు. డాన్యూబ్ నది తీరం వెంబడి ఏకంగా నాలుగు దేశాల రాజధానులు ఉన్నాయని జగన్ తెలుసుకోవాలని సూచించారు.
కేవలం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే జగన్ ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని యనమల ఆరోపించారు. అమరావతి గనుక అభివృద్ధి చెందితే రాష్ట్రానికి కేంద్ర నిధులు వస్తాయని, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, యువతకు ఉపాధి లభిస్తుందని.. కానీ అది జగన్‌కు ఇష్టం లేదని విమర్శించారు. అందుకే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.