అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దూకుడును అంచెలంచెలుగా పెంచుతోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నేత, ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.
లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. వరుసగా కీలక నేతలకు సమన్లు జారీ చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉండగా, సరిగ్గా ఆ మరుసటి రోజే అంటే జనవరి 23న ఎంపీ మిథున్ రెడ్డిని విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. వరుసగా ఇద్దరు కీలక నేతలను వరుస రోజుల్లో విచారించాలని నిర్ణయించడం వెనుక బలమైన ఆధారాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఇకపోతే మిథున్ రెడ్డికి ఈ కేసులో ఇబ్బందులు ఎదురవ్వడం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనను స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. అనంతరం కోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చినప్పటికీ, ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.