సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. ఒక్కోసారి ఆఫర్ ఇంటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే విషయం యంగ్ బ్యూటీ కృతి శెట్టి విషయంలో జరిగింది. ఆమె పడ్డ కష్టం వృథా అయిపోగా, ఆ లక్కీ ఛాన్స్ అనూహ్యంగా మహానటి కీర్తి సురేష్‌ను వరించింది.
గత కొద్దిరోజులుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కృతి శెట్టి, బాలీవుడ్ మీద భారీ ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా అక్కడ పాగా వేయాలని పట్టుదలతో ఉంది. అందుకోసం ఒక భారీ మల్టీస్టారర్ సినిమా ఆడిషన్స్ కోసం ఇటీవల ముంబైకి చేరుకుంది. దాదాపు రెండు రోజుల పాటు అక్కడే ఉండి, మేకర్స్ అడిగినట్టుగా ఆడిషన్స్ ఇచ్చింది. తీరా అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఆమెకు గట్టి షాక్ తగిలింది.
టైగర్ ష్రాఫ్, విద్యుత్ జమ్వాల్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో కృతి శెట్టికి బదులుగా కీర్తి సురేష్ ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు మేకర్స్. పెళ్లి తర్వాత స్పీడ్ తగ్గించిన కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారింది. ఇప్పటికే `బేబీ జాన్` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తాజాగా తన రెండో హిందీ ప్రాజెక్ట్ కు సతకం చేసింది. మొత్తానికి కృతి ఆడిషన్స్ ఇచ్చి కష్టపడితే, కీర్తి సురేష్‌కు మాత్రం ఆ అవకాశం అదృష్టంలా వెతుక్కుంటూ వచ్చింది. ఇక చేతి వరకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ చేజారడంతో కృతి కాస్త నిరాశలో ఉన్నట్లు టాక్.