ఇటీవల ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో చోటు చేసుకున్న నిరసనల గురించి తెలిసిందే. నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు నిరసనకారులపై కాల్పులు జరపటమే కాదు.. మరో ఆలోచన లేకుండా వారిని చంపేసేందుకు ఇరాన్ ప్రభుత్వం చేపట్టిన మారణకాండపై ప్రఖ్యాత మీడియా దిగ్గజం టైమ్ సంచలన కథనాన్ని వెలువరించిది. ఇప్పటివరకు ఇరాన్ లో నిర్వహించిన నిరసనల్లో 3117 మంది నిరసనకారులు మరణించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించటం తెలిసిందే.
అయితే.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మీద పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని అక్కడి సైనిక వర్గాలు బలవంతంగా అణిచివేశాయి. ఈ సందర్భంగా భారీ మారణకాండకు కారణమైందంటున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా టైమ్ కథనం ఉండటం గమనార్హం. ఇరాన్ వ్యాప్తంగా నాలుగు వేల ప్రాంతాల్లో చోటు చేసుకున్న నిరసనల్లో ఆందోళనకారులపై భద్రతా దళాలు ఉక్కుపాదంతో అణిచివేశాయి.
ఈ నిరసనల్లో మరణించిన నిరసనకారుల సంఖ్య ఇరాన్ అధికార ప్రకటనకు.. అమెరికా కేంద్రంగా పని చేసే హ్యూమన్రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ లెక్కలకు పొంతన కుదరటం లేదు. ఇరాన్ ప్రభుత్వం మరణించిన నిరసనకారుల సంఖ్య 3117 ఉందని చెబితే.. అమెరికా ఎన్జీవో మాత్రం 5459 మరణాల్ని ధ్రువీకరించింది. మరో 17,031 మరణాలపై సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే.. టైమ్ కథనంలో మాత్రం నిరసనకారుల మరణాలు 30 వేలకు పైనే ఉన్నట్లుగా పేర్కొంది.
ఇరాన్ మీద దాడి చేసేందుకు తాము సిద్దమవుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో.. ఖమేనీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు.. అగ్రరాజ్యం అండ చూసుకొని నిరసనలతో బయటకు వచ్చారు. కానీ.. ఈ ఇష్యూలో ఒక అడుగు ముందుకు వేసినట్లే వేస్తున్న ట్రంప్.. ఆ వెంటనే రెండు అడుగులు వెనక్కి వేయటంతో మరణాల సంఖ్య భారీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంకోవైపు తమపై అగ్రరాజ్యం దాడికి పాల్పడితే.. తమ సుప్రీం కమాండ్ దొరకక్కూడదన్న ఉద్దేశంతో టెహ్రాన్ లోని ఒక సురక్షితమైన బంకరులో ఆయన్ను దాచి ఉంచినట్లుగాచెబుతున్నారు. మరోవైపు అమెరికా సైనిక వర్గాలు ఇరాన్ కు చేరువులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న వేళ.. ఇరాన్ లో ఏం జరగనుంది? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.