హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు పర్వతాల మధ్య ఒక గుండెను పిండేసే దృశ్యం వెలుగులోకి వచ్చింది. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోగా, ఆ ప్రాణం వదిలిన దేహానికి ఒక మూగజీవం అందించిన రక్షణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భార్మౌర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన, మనుషుల మధ్య తగ్గిపోతున్న విశ్వాసానికి ఒక నిలువుటద్దంలా నిలిచింది.
కొద్దిరోజుల క్రితం ఒక వ్యక్తి తన పెంపుడు పిట్ బుల్ కుక్కతో కలిసి అత్యవసర పనిమీద బయలుదేరాడు. అయితే, ఊహించని విధంగా కురిసిన భారీ మంచు తుపాను, గడ్డకట్టే చలి అతడిని కోలుకోలేని దెబ్బ తీశాయి. దారి మధ్యలోనే చలిని తట్టుకోలేక ఆ వ్యక్తి కుప్పకూలి కన్నుమూశాడు. చుట్టూ కొండలు, పైన ఆకాశం నుండి రాలుతున్న మంచు.. కానీ అతడి పక్కన మాత్రం ప్రాణ స్నేహితుడిలా ఆ శునకం అలాగే ఉండిపోయింది.
అసలు మనుషులే నిలబడలేని ఆ గడ్డకట్టే చలిలో, ఆ పిట్ బుల్ ఏకంగా నాలుగు రోజుల పాటు తన యజమాని మృతదేహానికి కాపలా కాసింది. ఆకలి దప్పికలను మరిచిపోయింది. మంచు తన శరీరాన్ని కప్పేస్తున్నా లెక్కచేయలేదు. తన యజమాని ఇక లేడనే నిజాన్ని అది జీర్ణించుకోలేకపోయిందో ఏమో కానీ, ఆ మృతదేహాన్ని శత్రువుల నుండి, వన్యప్రాణుల నుండి కాపాడుతూ అక్కడే తిష్ట వేసింది.
చివరకు గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బందికి ఆ వ్యక్తి మృతదేహం కనిపించింది. కానీ, అక్కడే అసలైన ట్విస్ట్. తమ యజమానిని తీసుకెళ్లడానికి వచ్చిన రెస్క్యూ టీమ్‌ను కూడా ఆ శునకం దగ్గరకు రానివ్వలేదు. ఎక్కడ తన యజమానిని హాని చేస్తారో అన్నట్లుగా గర్జిస్తూ వారిపైకి దూకింది. చివరకు సిబ్బంది ఎంతో కష్టపడి, ఆ శునకాన్ని ప్రేమగా మచ్చిక చేసుకుని, సముదాయించిన తర్వాతే మృతదేహాన్ని అక్కడి నుండి తరలించడం సాధ్యమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనిషికి మనిషే శత్రువు అవుతున్న ఈ రోజుల్లో, ప్రాణం పోయినా తోడు వీడని ఈ మూగజీవం విశ్వాసం ముందు ఏదైనా చిన్నదే అంటూ నెటిజన్లు కంటతడి పెడుతున్నారు.
खोने का दर्द... कैसे करे बयान
— Pravin Yadav/प्रवीण यादव (@pravinyadav) January 26, 2026
भारी फीट बर्फबारी में भी नहीं छोड़ा साथ, 4 दिन भूखा-प्यासा मालिक के शव की निगरानी करता रहा#chamba #dog pic.twitter.com/elMS11O7xZ