టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఒక సంచలనం.. మరెన్నో అద్భుతాలకు వేదికగా నిలిచింది. 2022 వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఆ తర్వాత.. నుంచి అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ పరిస్థితి అడకత్తెరలో అన్నట్టుగా మారిపోయింది. వైసీపీ నేతల దూకుడు.. కీలక నియోజకవర్గాల్లో సైతం టీడీపీ జెండా ఎగరనివ్వని పరిస్తితి.. వంటివి తమ్ముళ్లను బెంబేలెత్తించాయి.
ఇలాంటి సమయంలో ఒకానొక వేళ.. అసలు టీడీపీ అస్తిత్వమే ఇరుకున పడే పరిస్థితి వచ్చింది. పార్టీని నిలబెట్టుకోవడమే కష్టమవుతుందా? అన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ఇలాంటి సమయంలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. నారా లోకేష్.. ప్రజల మధ్యకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. పాదయాత్ర కు సన్నద్ధమయ్యారు. చాలా మంది అనుకున్నట్టుగా.. అప్పట్లో పాదయాత్ర లక్ష్యం.. అధికారం కాదు!. పార్టీ నాయకులను, కార్యకర్తలను నిలబెట్టుకోవడమే!
తద్వారా.. పార్టీ అస్తిత్వానికి ప్రమాదం లేకుండా చూసుకోవాలన్న కీలక నిర్ణయమే.. నారా లోకేష్‌ను ముం దుకు నడిపించింది. అలా.. 2023, జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఒక ప్రభంజనం మాదిరిగా ప్రారంభమైన యువగళం పాదయాత్ర అనేక అద్భుతాలను మాత్రమే కాదు.. అనేక సమస్యలు కూడా ఎదురయ్యేలా చేసింది. ఎక్కడికి వెళ్తే అక్కడ నిబంధనలు నారా లోకేష్‌ను చుట్టుముట్టాయి. ఒకానొక దశలో ఆయనకు కుర్చీ కూడా లేకుండా చేసిన పరిస్థితి కూడా ఎదురైంది.
అంతేకాదు.. మైకు కూడాముట్టుకోరాదంటూ.. పోలీసులు పెట్టిన యాక్ట్-30 ప్రజలతో `యాక్`మనిపించేలా చేసింది. అంతేనా.. పాదయాత్రకు కూడా పలు సందర్భాల్లో బ్రేకులు పడ్డాయి. చంద్రబాబు అరెస్టు.. పాదయాత్రకు ప్రధానంగా బ్రేక్ ఇచ్చేలా చేసింది. ఇక, అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, పట్టుబట్టి.. నారా లోకేష్ పాదయాత్రను ముగించారు. మొత్తంగా ఇది లోకేష్ రాజకీయ జీవితాన్ని ఓ పెద్ద మలుపు తిప్పింది. పార్టీకి ఐకాన్ నాయకుడిని అందించింది.