ఏపీలో జరుగుతున్న పరిణామాలు పార్లమెంటును తాకాయి. వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రు లు కూడా అయిన అంబటి రాంబాబు, జోగి రమేష్‌లు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు.. వారి ఇళ్లపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరువురి ఇళ్లకు కొందరు ఆందోళన కారులు నిప్పు కూడా పెట్టారు. ఇక, సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో అంబటిపై కేసు నమోదు కావడం.. ఆయనను రాజమండ్రి జైలుకు కూడా తరలించడం తెలిసిందే.
అయితే.. ఈ పరిణామాలను పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని.. దేశ రాజధాని వరకు కూడా ఏపీలో ఏం జరుగుతోందో తెలియాలని వైసీపీ అధినేత జగన్ చేసిన సూచనలతో వైసీపీకి చెందిన లోక్‌సభ, రాజ్య సభ సభ్యులు మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయంటూ.. ప్లకార్డులు పట్టుకుని.. గాంధీ విగ్రహం వద్ద రెండు గంటలకు పైగా నిరసన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై అన్యాయంగా దాడి చేశారని వ్యాఖ్యానించారు.
ఏపీలో శాంతి భద్రతలు అడుగంటాయని.. పోలీసులు ఏం జరిగినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.ఈ నిరసనలో తిరుపతి ఎంపీ మూర్తి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, అరకు ఎంపీ తనూజా రాణి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా.. రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులకే భద్రత లేకుండా పోయిందని నినాదాలు చేశారు.
వైవీ వ్యాఖ్యలు..
ఏపీలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని.. మాజీ మంత్రులకే భద్రత లేకుండా పోయిందని రాజ్య సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లోనూ ఈ అంశాలను లేవనెత్తుతున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు.