వైసీపీ అధినేత జగన్.. ప్రజలను పరామర్శించడం.. వారి కష్టాలు తెలుసుకోవడం.. వారి కోసం అసెంబ్లీకి వెళ్లి ప్రశ్నించడం.. లేదా సమస్యలు ప్రస్తావించడం అనే విషయాలను పక్కన పెట్టేశారు. కేవలం తన పార్టీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించేందు కు మాత్రమే అన్నట్టుగా ఆయన తాడేపల్లి నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు.. అదే జరిగింది. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని, కాకాణి గోవర్థన్‌రెడ్డిని, గంజాయి బ్యాచ్‌గా పేరు బడి పోలీసులతో తన్నులు తిన్న కొందరు యువకుల కుటుబాలను ఆయన పరామర్శించారు. ఇప్పుడు కూడా ఇదే విధానంలో యాత్రకు రెడీ అయ్యారు.
సీఎం చంద్రబాబుపై బండబూతులతో విరుచుకుపడి, రాష్ట్రంలో కల్లోలానికి కారణమైన మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బయలు దేరు తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారికంగా పార్టీ కార్యాలయం విడుదల చేసింది. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి జాతీయ రహదారి మీదుగా గుంటూరు జిల్లాలోని అంబటి నివాసానికి చేరుకుంటారు. అక్కడ 11-12 గంటల మధ్య అంటే.. ఒక గంట సేపు అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం.. తిరుగు ప్రయాణమవుతారు.
జడ్+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలంటూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ .. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాలకు సమాచారం అందించారు. అయితే.. అసలు ఈ పర్యటనకు పోలీసుల నుంచి అనుమతి ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. గతంలో జగన్ చేసిన పరామర్శల యాత్రలు తీవ్ర ఉద్రిక్తతలకు.. తోపులాటలకు దారి తీశాయి. ఇదే గుంటూరు జిల్లాలో రెండేళ్ల కిందట చనిపోయినకార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. ఓ వ్యక్తి జగన్ కాన్వాయ్ కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో జగన్ పరామర్శల యాత్రలు అంటే.. అధికార యంత్రాంగంతో పాటు సాధారణ ప్రజలు కూడాబెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.