తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల హీట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం చేస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ప్రభావం తెలంగాణపై శూన్యమని, ఆయన ఇక్కడికి వచ్చినా ఒరిగేదేమీ లేదని కుండబద్దలు కొట్టారు.
పవన్ కల్యాణ్‌ను ఒక ఆంధ్రా నాయకుడి గా అభివర్ణించిన మహేశ్ గౌడ్, ఆయన రాజకీయం కేవలం ఏపీకే పరిమితమని స్పష్టం చేశారు. ``పవన్ కల్యాణ్ ఒక తెలంగాణ వ్యతిరేకి. గతంలో ఆయన తెలంగాణ సమాజం గురించి, ఇక్కడి సంస్కృతి గురించి ఎంత నీచంగా మాట్లాడారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతారు?`` అని నిలదీశారు. పవన్ తన రాజకీయ చదరంగాన్ని ఆంధ్రాలోనే ఆడుకోవాలని, తెలంగాణ గడ్డపై ఆయన ఆటలు సాగవని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ వైఖరిపై కూడా మహేశ్ గౌడ్ సెటైర్లు వేశారు. సొంతంగా గెలిచే సత్తా లేకనే బీజేపీ నేతలు పవన్ కల్యాణ్ కాళ్ల దగ్గరకు వెళ్లారని విమర్శించారు. బీజేపీ నేతలు పవన్‌ను భిక్షాం దేహీ అంటూ అడుక్కున్నారని.. కానీ వాస్తవం ఏంటంటే పవన్‌కు ఇక్కడ అంత సీన్ లేదని, ఆయన ప్రచారం చేసినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ హవాను ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, పవన్ కల్యాణ్ వంటి వారి గ్లేమర్ పాలిటిక్స్‌కు ఇక్కడ తావు లేదని మహేశ్ గౌడ్ కుండబద్దలు కొట్టారు.