అమరావతికి బిల్ గేట్స్.. ఏపీ ఐటీ చరిత్రలో మరో కీలక మలుపు!

admin
Published by Admin — February 05, 2026 in Politics, Andhra
News Image

హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో నిలబెట్టిన ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది. మూడు దశాబ్దాల క్రితం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో మొదలైన ప్రస్థానం.. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్వయంగా అమరావతికి వ‌స్తున్నార‌నే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

1995లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బిల్ గేట్స్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు, అతి కష్టం మీద పది నిమిషాల అపాయింట్‌మెంట్ దొరికింది. కానీ బాబు విజన్ చూసి, ఆయ‌న ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి ముగ్ధుడైన గేట్స్, ఆ పది నిమిషాలను కాస్తా గంటల కొద్దీ చర్చగా మార్చడమే కాకుండా, అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్ తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క నిర్ణయం హైదరాబాద్ నగరం రూపురేఖలను మార్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే జోడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేతులు కలుపుతుండటంతో ఐటీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ప్రస్తుత పర్యటనలో ప్రధాన అజెండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విద్య, వైద్యం, మరియు వ్యవసాయ రంగాల్లో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకుంది. చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న `సంజీవని` ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులను సిద్ధం చేయనున్నారు. బిల్ గేట్స్ రాకతో ఈ ప్రాజెక్టులకు మరింత వేగం పెరగడమే కాకుండా, అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రానుంది.

చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అయిన `క్వాంటం వ్యాలీ`పై కూడా ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో బిల్ గేట్స్ సంస్థలు పెట్టుబడులు పెడితే, సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. ఐటీ రంగంలో ఏపీ మళ్ళీ అగ్రగామిగా నిలవడానికి, లక్షలాది మంది యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావడానికి కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. కాగా, ఈ నెల 16న జరిగే ఈ భేటీ ఏపీ ఐటీ రంగాన్నే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే మలుపు తిప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌రి ఈ చారిత్రాత్మక పర్యటన ఏపీ స్వరూపాన్ని ఎలా మార్చబోతుందో చూడాలి!

Tags
Bill Gates Chandrababu Naidu Amaravati Andhra Pradesh AP Development AI
Recent Comments
Leave a Comment

Related News