జ‌న‌సేన ఎమ్మెల్యే కేసు.. తెర‌పైకి మ‌రిన్ని వీడియోలు.. రూ. 25 కోట్లు డిమాండ్‌!

admin
Published by Admin — February 05, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి హైకోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది. తాజాగా తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు, ఎమ్మెల్యేపై మరిన్ని షాకింగ్ విష‌యాలు బయటపెట్టారు.

ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను సదరు మహిళ రూ. 25 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తోందన్న వార్తలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ``నేను డబ్బు కోసం ఆశపడే వ్యక్తినైతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. నాకు కావాల్సింది కేవలం న్యాయం మాత్రమే. 25 కోట్లు అడిగాననేది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు`` అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

మరిన్ని వీడియోలు విడుదల చేస్తా!
ఈ వివాదంలో త్వరలో మరిన్ని బాంబులు పేలనున్నట్లు బాధితురాలు సంకేతాలిచ్చారు. ఎమ్మెల్యే శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఏడాది కాలంగా లైంగికంగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. ``నన్ను మాత్రమే కాదు, ఆయన చాలా మంది మహిళలను ఇలాగే మోసం చేశారు. నా దగ్గర ఆయనకు సంబంధించిన మరిన్ని ఆధారాలు, వీడియోలు ఉన్నాయి. త్వరలోనే వాటన్నింటినీ బయటపెడతాను`` అని చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది.

రాష్ట్ర మహిళా కమిషన్ గట్టిగా జోక్యం చేసుకోవడం వల్లే పోలీసులు తన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, తనకు న్యాయం కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉండటంతో, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags
MLA Arava Sridhar Railway Koduru Janasena Andhra Pradesh AP High Court PawanKalyan
Recent Comments
Leave a Comment

Related News

Latest News