వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన భయాన్ని, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఎవరినో పరామర్శించడానికి జగన్ వస్తుంటే.. ఆ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న సొంత పార్టీ శ్రేణులే విగతజీవులుగా మారుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతం నుంచి నేటి ఇబ్రహీంపట్నం ఘటన వరకు జగన్ పర్యటనల చుట్టూ ఏదో ఒక మృత్యు నీడ వెంటాడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. అయితే ఈ పర్యటన ఇద్దరు కార్యకర్తల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. చిల్లకల్లు గ్రామానికి చెందిన పంచాయతీ ప్రెసిడెంట్ రాంబాబు, తన నాయకుడిని చూడాలనే ఉత్సాహంతో బయలుదేరి దారిలోనే కుప్పకూలిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోవైపు, ఇబ్రహీంపట్నం కొత్తగేటుకు చెందిన భార్గవ్ అనే యువకుడు, జగన్ వస్తున్నాడన్న అతి ఉత్సాహంతో బైక్ స్టంట్లు చేస్తూ బార్ గేట్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకరిని ఓదార్చడానికి వెళ్తున్న జగన్, తన రాకతో మరో ఇద్దరిని కానరాని లోకాలకు పంపారనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది.
జగన్ పర్యటనల్లో ఇలాంటి విషాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో కూడా జగన్ కాన్వాయ్ కింద పడి ఒక కార్యకర్త మృతి చెందడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది. అసలు జగన్ పర్యటనల సమయంలో భద్రతా వైఫల్యాలు ఉంటున్నాయా? లేక కార్యకర్తల అతి ఉత్సాహం ప్రాణాల మీదకు తెస్తుందా? అన్నది పక్కన పెడితే.. అడుగు పెట్టిన ప్రతిచోటా అపశకునాలు ఎదురవుతుండటం వైసీపీ వర్గాలను కలవరపెడుతోంది.
రాజకీయాల్లో నాయకుడిపై అభిమానం ఉండటం సహజం. కానీ, జగన్ పర్యటనల కోసం చేసే హడావుడి, బైక్ ర్యాలీలు, ప్రమాదకరమైన స్టంట్లు యువ కార్యకర్తల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. జగన్ అడుగు పెడితే శవాలు లేవాల్సిందే అనే ముద్ర పడకముందే, పార్టీ అధిష్టానం కార్యకర్తల భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.