తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చావును రేవంత్ పదే పదే కోరుకుంటున్నారని హరీశ్ రావు, కేటీఆర్ విమర్శించినా సరే రేవంత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాజాగా మరోసారి కేసీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత? అన్నం తినేవాడెవడైనా మొగుడు పెళ్లాం మాట్లాడుకునే మాటలు చాటుగా వింటాడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తులకు పోలీసులు నోటీసులిచ్చారని, దీంతో, మా జాతిపితకు నోటీసులిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారని రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘‘ఎవనికి రా నువ్వు జాతి పితవు? ఎవడు నీ జాతి? వినోద్ రావు నీ జాతా? ఎర్రబెల్లి దయాకరావు నీ జాతా? కూకట్ పల్లి కృష్ణారావు నీ జాతా? తన్నీరు హరీష్ రావు గారు నీ జాతా?... మా తెలంగాణకు , మా నల్గొండకు , మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతేంది..నీ నీతేంది...? మొగుడు పెళ్లాం మాటలు చాటుగా వినే నువ్వు జాతి పితవంటే... ఎవడన్న ఉంటే ఆత్మహత్య చేసుకుంటడు...బావిలో దూకి సచ్చి పోతడు..సిగ్గుతోని తలవంచుకుంటడు...’’ అంటూ కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇక, కేటీఆర్, హరీష్ రావులను విచారణ సందర్భంగా వారి ముఖాలకు పోలీసులు ముసుకు తొడిగి తీసుకువెళ్లాల్సిందని, మసి పూసి పట్టుకొచ్చి విచారణ జరపాల్సిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీసులు మంచోళ్లు కాబట్టి..ఏం అనలేదని అన్నారు. కేసీఆర్ కు నోటీసులిస్తే తెలంగాణ సమాజానికి నోటీసులిచ్చినట్లని కేటీఆర్ అంటున్నాడని, మరి, జన్ వాడలో ఉన్న ఫాం హౌస్ తెలంగాణ ప్రజలదా అని ప్రశ్నించారు. అయితే, కేసీఆర్ ఎవరికి జాతిపిత అని ప్రశ్నించినప్పుడు ప్రజలు చప్పట్లు, కేరింతలు కొట్టడం విశేషం.