పూత‌ల`ప‌ట్టు`.. కోల్పోతున్న ఎమ్మెల్యే..!

admin
Published by Admin — February 08, 2026 in Politics, Nri, Movies, Andhra, Reviews, Telangana, National, English, International, Gallery
News Image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గం పూతలపట్టు. ఇది వైసీపీకి బలమైన కంచు కోటగా చెబుతారు. దీనికి ప్రధాన కారణం వరుసగా ఇక్కడ వైసిపి విజయం దక్కించుకోవడమే. 2014 ఎన్నికల్లో వైసిపి ఇక్కడ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కింది. ఇక 2024 వచ్చేసరికి మాత్రం కూటమి ప్రభావంతో వైసీపీ పరాజయం పాలైంది. అయితే ఈ పరాజయ‌మే శాశ్వతం అనుకుంటే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడికి తీవ్ర నష్టం చేయడం ఖాయం అన్నది కూటమిలోనే జరుగుతున్న చర్చ.

దీనికి ప్రధాన కారణం ఆయన తన సొంత రాజకీయాలు చేసుకోవడం. నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో పాటు అసలు ప్రజల మధ్య కూడా ఉండకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. గతంలో పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెస్ బాబు విజయం సాధించారు. కానీ గ‌త ఎన్నిక‌ల్లో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇప్పుడు తిరిగి మళ్లీ వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మురళీమోహన్ వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ఆయనకు స్థానికంగా గౌరవ మర్యాదలకు లోటు లేదు. కానీ, నియోజకవర్గం పరంగా చూసినప్పుడు సమస్యల ప్రస్తావన, అభివృద్ధి, పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడం వంటివి మాత్రం ఆయనకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం, కార్యకర్తలు వస్తే కూడా పలకరించకపోవడం అంటూ మైనస్ గా ఉన్నాయి.

అంతేకాదు అంతర్గత చర్చల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా పార్టీ అధిష్టానానికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేక గాలులు వీచే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల మధ్య నడుస్తున్న చర్చ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అడుగులు వేయకపోతే ప్రజలకు చేరువ కావడం మరోసారి విజయం దక్కించుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది అన్నది గుర్తించాల్సిన పరిస్థితి ఉంది.

అలా కాకుండా ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళితే అది ఆయనకే నష్టం తప్ప పార్టీకి కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ నష్టం అనేది ఉండదు. ప్రాథమికంగా చూస్తే ప్రజలకు చేరువ కాకపోవడం విషయంలో పూతలపట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఎమ్మెల్యే ఎప్పటికైనా ప్రజల మధ్యకు రావడం, పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడం, కార్యకర్తలను కలుసుకోవడం వంటివి ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలుగా సీనియర్లు చెబుతున్నారు.

Tags
Dr. Kalikiri Murali Mohan Puthalapattu MLA Puthalapattu TDP Ap Politics Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News