రాజకీయాల్లో హుందాతనం మచ్చుకైనా కనిపించడం లేదు. విమర్శలు విజ్ఞతను దాటుతున్నాయి.. ఆరోపణలు అశ్లీలతను తాకుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఈ బూతుల పురాణం పై భారత మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయ భీష్ముడు ముప్పవరపు వెంకయ్య నాయుడు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విశాఖ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ``బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే ప్రజలు సమాధి కట్టాలి`` అంటూ ఆయన ఇచ్చిన పిలుపు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎవరిని ఉద్దేశించి ఈ వార్నింగ్..?
వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. కానీ, ఆయన మాటల వెనుక ఉన్న అంతరార్థం ఎవరిని ఉద్దేశించినదో ఇటు రాజకీయ విశ్లేషకులకు, అటు సామాన్య ప్రజలకు ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల ఏపీలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సీనియర్ నేతలే కట్టుతప్పుతుంటే, ఇక తర్వాతి తరం నేతలు ఏం నేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. ``బూతులు మాట్లాడటం ఒక ఫ్యాషన్‌గా మారింది.. తిడితేనే పేపర్లలో, టీవీల్లో వస్తామనుకోవడం మూర్ఖత్వం`` అంటూ ఆయన వేసిన సెటైర్లు నేరుగా ఆ నేతలకే తగిలాయి.
వెంకయ్య తన ప్రసంగంలో పాత తరం రాజకీయాలను గుర్తు చేసుకున్నారు. అటల్ బిహారీ వాజపేయి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటి మహోన్నత నేతలు విమర్శలను కూడా ఎంత హుందాగా చేసేవారో ఉదాహరణగా చెప్పారు. నేటి తరం నేతలు వారిని చూసి నేర్చుకోవాల్సింది పోయి, నోటికొచ్చినట్లు వాగడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ``మా కాలంలో రాజకీయ నేతల నుంచి విజ్ఞానం నేర్చుకునేవాళ్లం.. ఇప్పుడున్న నేతలను చూసి యువత కేవలం బూతులు మాత్రమే నేర్చుకునే పరిస్థితి వచ్చింది`` అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాకు చురకలు.. ప్రజలకు పిలుపు!
కేవలం నాయకులనే కాకుండా, బూతులు మాట్లాడే వారికి అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్న మీడియాను కూడా వెంకయ్య నాయుడు చురకలు వేశారు. అసభ్యంగా మాట్లాడే వారిని మీడియా బహిష్కరించాలని సూచించారు. అయితే, వీటన్నింటికంటే ముఖ్యంగా ఓటర్ల చేతిలో ఉన్న ఆయుధాన్ని ఆయన గుర్తు చేశారు. ``నాయకులు మారకపోతే.. వారిని మార్చాల్సిన బాధ్యత ప్రజలదే. అనవసరంగా నోరు పారేసుకునే వారికి సైలెంట్‌గా పోలింగ్ బూతుల్లోనే బుద్ధి చెప్పండి`` అంటూ వెంకయ్య పిలుపునిచ్చారు.