ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి `స్థానిక`పోరుపైనే నెలకొంది. సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గకముందే, కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది. గ్రామ స్థాయి నుంచి పట్టు సాధించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక రకమైన గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత క్యాడర్‌లో నెలకొన్న నైరాశ్యం, ఇప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణపై వైసీపీ వ్యూహాలను డైలమాలో పడేసింది.
గత పదేళ్లుగా టీడీపీ శ్రేణులు స్థానిక సంస్థల పదవులకు దూరంగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల ఏకగ్రీవాలు, నామినేషన్ల అడ్డుగింతలు ఎదుర్కొన్నామని కూటమి నేతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు అధికారంలోకి రాగానే, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించి గ్రామ స్థాయి అధికార పీఠాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. తొలుత పంచాయతీలు, ఆపై ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం వైసీపీకి కత్తి మీద సాము లాంటిదే. ఓటమి భయం ఒకవైపు, ఆర్థిక వనరుల కొరత మరోవైపు పార్టీని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ముందు ప్రధానంగా రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎన్నికల ప్రక్రియను వీలైనంత కాలం అడ్డుకోవడం. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కోర్టులను ఆశ్రయిస్తే.. కొంత సమయాన్ని గెలుచుకోవచ్చని పార్టీ భావిస్తోంది. రెండో ఆప్షన్ క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, ఎన్నికలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలో సానుభూతి పొందడం. కానీ, ఇది పార్టీ ఉనికికే ప్రమాదకరమని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఒకసారి పోటీకి దూరమైతే గ్రామాల్లో క్యాడర్ పూర్తిగా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది.
స్థానిక ఎన్నికలంటే కేవలం రాజకీయాలు మాత్రమే కాదు, భారీగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అధికార పార్టీకి సహజంగానే ఉండే అనుకూలతను తట్టుకుని నిలబడాలంటే బలమైన అభ్యర్థులు కావాలి. కానీ, ఓడిపోతామనే భయం ఉంటే ఖర్చు పెట్టేందుకు నేతలు ముందుకు రావడం లేదు. మొత్తానికి, ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ మనుగడకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తారో చూడాలి.