మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు రాజకీయంగా, న్యాయపరంగా గడ్డుకాలం నడుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, ఇప్పుడు పాత కేసులు గుదిబండలా మారుతున్నాయి. ఒకవైపు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు పోలీసులు పాత ఫైళ్లను దుమ్ముదులిపి పీటీ వారెంట్లతో సిద్ధమవుతుండటం అంబటిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అసలు పరీక్ష ఇప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది.
గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నా ఇప్పుడు అంబటి మెడకు చుట్టుకుంది. ఆ సమయంలో పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ వెళ్లడం, విధుల్లో ఉన్న అధికారులపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్నాళ్లూ స్తబ్దంగా ఉన్న ఈ కేసులో ఇప్పుడు కదలిక వచ్చింది. ఈ మేరకు గుంటూరు కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్ అంబటిపై ఉచ్చు మరింత బిగుస్తోందనడానికి సంకేతంగా కనిపిస్తోంది.
కోర్టులో కీలక సమరం.. నేడే తేలనున్న భవితవ్యం!
ప్రస్తుతం అంబటి రాంబాబు భవితవ్యం గుంటూరు కోర్టు చేతుల్లో ఉంది. ఒక్క రోజులోనే నాలుగు కీలక పిటిషన్లపై విచారణ జరగనుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ వస్తుందని అంబటి వర్గం ఆశిస్తుంటే, పోలీసు కస్టడీకి ఇవ్వాలని అధికారులు పట్టుబడుతున్నారు. దీనికి తోడు జైలులో అదనపు సౌకర్యాల కోసం ఆయన వేసిన పిటిషన్పై కూడా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి నుంచి గుంటూరుకు తరలించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
అంబటిపై కేవలం ఇవే కాకుండా మరిన్ని కేసులు కూడా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. పట్టాభిపురం పోలీసుల దారిలోనే మిగిలిన స్టేషన్ల పోలీసులు కూడా పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే, ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చూపేలా అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.