అంబటి ‘జైలు’ ముచ్చట్లు.. జగన్ రియాక్షన్ ఇదే!

admin
Published by Admin — February 20, 2026 in Politics, Andhra
News Image

తాడేపల్లి: గత కొన్ని రోజులుగా జైలు గోడల మధ్య గడిపిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, బెయిల్ పై బయటకు రాగానే నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కట్టారు. తనపై నమోదైన కేసులు, పోలీసులు వ్యవహరించిన తీరును ఏకరువు పెట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. తన ఇంటిపై జరిగిన దాడిని, పోలీసులు పెట్టిన కేసులను అధినేత‌కు పూసగుచ్చినట్లు వివరించారు. తనపై హత్యాయత్నం జరిగిందని, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదుల వర్షం కురిపించారు.

అంబటితో పాటు దేవినేని అవినాష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కూడా తమ బాధలను జ‌గ‌న్ ముందు చెప్పుకున్నారు. ఒకప్పుడు టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడే అంబటి, ఇప్పుడు తనపై జరుగుతున్న వేధింపుల గురించి చెప్తుంటే.. తాడేపల్లి వర్గాల్లో అదో రకమైన ముచ్చటగా మారింది. నేతల ఆవేదన విన్న జగన్, తనదైన శైలిలో భరోసా ఇచ్చారు. ``తప్పుడు కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇవన్నీ చట్టపరంగా ఎదుర్కుందాం`` అంటూ అభయం ఇచ్చారు.

ఇదే సమయంలో పోలీసుల తీరుపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు కూటమి ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారని, ప్రజల కోసం పోరాడేటప్పుడు ఇలాంటి ఆటంకాలు సహజమని క్లాస్ పీకారు. అంటే, కేసులు పడితే భయపడటం మానేసి, వాటిని మెడలో మెడల్స్ లాగా భావించాలనేది జగన్ గారి తాజా సందేశం అన్నమాట. అంతేకాదు, కేసులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడాలని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని జగన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొత్తానికి అంబటి జైలు ముచ్చట్లు, జగన్ లీగల్ భరోసాతో వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం అయితే జరిగింది.

Tags
Ambati Rambabu YS Jagan YSRCP Andhra Pradesh AP Politics Tadepalli
Recent Comments
Leave a Comment

Related News