వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆనందం గంటలు కూడా గడవకముందే.. ఆయనపై మరో కేసు నమోదైంది. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ,‘అతి ఉత్సాహం ప్రదర్శించడం అంబటిని మళ్ళీ చిక్కుల్లో పడేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఆయన నిర్వహించిన హంగామా ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
అసలు విషయం ఏంటంటే.. 18 రోజుల రిమాండ్ అనంతరం అంబటి రాంబాబు రెండు రోజుల క్రితం విడుదలయ్యారు. ఆయన రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్లే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. సెక్షన్ 30 కింద అంబటికి ముందస్తు నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, పరిమిత వాహనాలతో వెళ్లాలని, భారీ ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు స్పష్టంగా హెచ్చరించారు.
అయితే, పోలీసుల హెచ్చరికలను అంబటి రాంబాబు అస్సలు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి కార్లతో భారీ కాన్వాయ్‌గా బయలుదేరారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ షో చేశారని పోలీసులు గుర్తించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా, ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందుకు గాను రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాతో పాటు మరికొందరు వైసీపీ అనుచరులపై సెక్షన్ల వారీగా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. కాగా, ఒకవైపు పాత కేసులతో సతమతమవుతుంటే, ఇప్పుడు సొంత తప్పిద’ వల్ల కొత్త కేసు మెడకు చుట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.