రూ. 782 కోట్ల అప్పు.. రోడ్డున పడ్డ వైసీపీ మాజీ ఎంపీ ఆస్తులు..!

admin
Published by Admin — February 21, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో వెలుగు వెలిగినా, వ్యాపార సామ్రాజ్యాలను శాసించినా.. కాలం కలిసి రాకపోతే ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక. ఒకప్పుడు వేల కోట్ల టర్నోవర్‌తో అలరించిన బుట్టా గ్రూప్‌కు ఇప్పుడు ఎల్‌ఐసీ (LIC) రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. వందల కోట్ల బకాయిల కోసం ఆమెకు చెందిన అత్యంత విలువైన ఆస్తులను వేలం వేసేందుకు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సిద్ధమైంది.

బుట్టా రేణుక మరియు ఆమె భర్త నీలకంఠ గతంలో తమ వ్యాపార అవసరాల కోసం ఎల్‌ఐసీ నుంచి రూ. 340 కోట్ల భారీ రుణాన్ని తీసుకున్నారు. అయితే, కాలక్రమేణా ఆ అప్పు తీర్చకపోవడంతో వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. ప్రస్తుతం ఆ బకాయి మొత్తం అక్షరాలా రూ. 782 కోట్లకు చేరింది. దీనిపై గతంలోనే ఎల్‌ఐసీ నోటీసులు జారీ చేసినప్పటికీ, రుణ పరిష్కారం విషయంలో ఎటువంటి ముందడుగు పడలేదు. దీంతో విసిగిపోయిన ఎల్‌ఐసీ సంస్థ.. చివరకు తనకా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న బుట్టా గ్రూప్ ఆస్తులపై ఎల్‌ఐసీ కన్ను పడింది. సర్వే నెంబర్ 1009లోని సుమారు 3823 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయడానికి ఎల్‌ఐసీ బెంగళూరు బ్రాంచ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలోనే ప్రముఖ విద్యాసంస్థ `మెరీడియన్ స్కూల్` కొనసాగుతోంది. ఈ భూమి కనీస విలువ రూ. 65 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. వచ్చే మార్చి 24న ఈ వేలం ప్రక్రియ జరగనుంది.

2014లో వైసీపీ తరపున కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక, ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో టీడీపీకి మద్దతు ఇచ్చారు. మళ్ళీ 2019లో వైసీపీ గూటికి చేరినా టికెట్ దక్కలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పని చేసినా, 2024 ఎన్నికల తర్వాత ఆమె రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. అటు రాజకీయంగా గ్యాప్ రావడం, ఇటు వ్యాపార సామ్రాజ్యంలో అప్పుల సెగ తగలడంతో బుట్టా కుటుంబం ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.

Tags
Ex-MP Butta Renuka Butta Renuka LIC Auction YSRCP Meridian School Butta Group
Recent Comments
Leave a Comment

Related News