రఘురామ కేసులో మరో వికెట్ డౌన్‌.. నెక్స్ట్ టార్గెట్ జగనేనా?

admin
Published by Admin — February 23, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఫైళ్లు ఒక్కొక్కటిగా దుమ్ముదులుపుతుంటే, అప్పటి అధికార యంత్రాంగంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా, ఈ కేసులో మరో కీలక వికెట్ పడిపోయింది. ఉమ్మడి ఏపీ సీఐడీలో ఐజీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుతో ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.

తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంలో సునీల్ నాయక్ పాత్ర కీలకమని రఘురామకృష్ణరాజు గతంలోనే ఫిర్యాదు చేశారు. అయితే, ఏపీలో డిప్యూటేషన్ ముగియడంతో సునీల్ నాయక్ తన సొంత క్యాడర్ అయిన బిహార్‌కు వెళ్లిపోయారు. పోలీసులు నోటీసులు పంపినా, వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినా ఆయన స్పందించకపోవడంతో, ఏపీ సీఐడీ బృందం ఏకంగా పాట్నాలో ల్యాండ్ అయింది. అక్కడ స్థానిక పోలీసుల సాయంతో ఐజీ హోదాలో ఉన్న నాయక్‌ను అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ అవ్వ‌గా, ఇప్పుడు ఐజీ స్థాయి అధికారి దొరకడంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది.

ఈ అరెస్టు కేవలం అధికారులకే పరిమితం కాబోదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రఘురామ ఫిర్యాదులో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రధాన నిందితుల్లో ఒక‌రిగా పేర్కొన్నారు. అధికారుల విచారణలో ``ఎవరి ఆదేశాల మేరకు ఈ టార్చర్ జరిగింది?`` అనే ప్రశ్నకు వచ్చే సమాధానాలే ఇప్పుడు కీలకం కానున్నాయి. ఒకవేళ అరెస్టయిన అధికారులు పైస్థాయి ఒత్తిళ్ల గురించి నోరు విప్పితే, ఈ కేసు సెగ నేరుగా జగన్ మోహన్ రెడ్డికి తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా, ముందస్తు బెయిల్ కోసం సునీల్ నాయక్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, కోర్టులు కూడా ఈ కేసు తీవ్రతను గుర్తించడంతో ఇక తప్పించుకునే మార్గం లేదని స్పష్టమవుతోంది. పాట్నా కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయన్ని గుంటూరుకు తరలిస్తున్నారు. ఈ రాత్రికి ఆయన ఏపీకి చేరుకోనున్నారు. 

Tags
Raghu Rama Krishna Raju Sunil Nayak Arrest AP Police YS Jagan Andhra Pradesh Custodial Torture
Recent Comments
Leave a Comment

Related News