ఆంధ్రప్రదేశ్ శాసనమండలి(AP Council) గురువారం రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన చర్చ కాస్తా.. అధికార, ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత దూషణలకు, రాజకీయ యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ‘తల్లికి కోక పెట్టనివాడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టు’ అనే సామెత సభలో తీవ్ర ఉద్రిక్తతను నెలకొల్పింది.
సభ ప్రారంభం కాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఘాటుగా స్పందించారు. ``అసలు ఈ ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా?`` అంటూ నిలదీశారు. ప్రాజెక్టు పనులు ఆగిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యాలే కారణమని, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారంటూ మంత్రి మండిపడటంతో సభలో ఒక్కసారిగా వేడి పెరిగింది.
గుంతలకే రూ. 900 కోట్లా?
ఈ క్రమంలోనే మరో మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) చర్చను మరింత లోతుకు తీసుకెళ్లారు. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) పనులు నిలిపివేయాలని ఆదేశించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్ మోహన్ రెడ్డి కాదా? అప్పుడు నోరు మెదపని వైసీపీ నేతలు.. ఇప్పుడు చంద్రబాబుపై నెపం వేయడం విడ్డూరంగా ఉంది`` అని నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో పనులు సున్నా అని మండిపడ్డారు. ``కేవలం గుంతలు తవ్వి రూ. 900 కోట్లు నిధులు డ్రా చేసుకున్నారు తప్ప, రాయలసీమకు ఒక్క చుక్క నీరు అదనంగా ఇచ్చింది లేదు`` అని నిమ్మల విమర్శించారు. రాయలసీమకు నిజమైన ద్రోహి ఎవరో ప్రజలందరికీ తెలుసని నిమ్మల వ్యాఖ్యానించారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో రాయలసీమ(Rayalaseema)ను పూర్తిగా విస్మరించారని మంత్రి ఆరోపించారు. ``సొంత నియోజకవర్గమైన పులివెందులకు నీళ్లు ఇచ్చే చిత్రావతి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. కనీసం పులివెందులకు నీళ్లు ఇవ్వలేని వ్యక్తి.. సీమ మొత్తాన్ని ఉద్ధరిస్తానని చెప్పడం హాస్యాస్పదం`` అని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే `తల్లికి కోక పెట్టనోడు..పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్టు జగన్ పరిస్థితి ఉంది` అంటూ వైసీపీ బాస్‌పై ఘాటు సెటైర్ పేల్చారు.
మంత్రి వ్యాఖ్యలతో వైసీపీ(YCP) సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సభా మర్యాదలు పాటించడం లేదని, సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభ్యులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో సభను వరుసగా వాయిదా వేయాల్సి వచ్చింది.