మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణం, గిరిజన బిడ్డల కష్టం... అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచపు నడిబొడ్డున జెండా పాతడానికి సిద్ధమైపోయింది! ఈ అద్భుతమైన వార్తను పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఏం జరిగిందంటే?
న్యూయార్క్ చలిలో ఆనంద్ మహీంద్రా ఒక సెల్ఫీ దిగి పోస్ట్ చేయగా, 'విజయ్' అనే నెటిజన్ ఒక కొంటె ప్రశ్న వేశాడు. "మహీంద్రా గారు, మీ సెల్ఫీలో ఆ న్యూయార్క్ గ్లామర్ రావాలంటే చేతిలో ఒక స్టార్‌బక్స్ కప్పు ఉండాలి కదా?" అని సరదాగా కామెంట్ చేశాడు.
మహీంద్రా మార్క్ అదిరిపోయే సమాధానం!
దానికి ఆనంద్ మహీంద్రా తన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. "స్టార్‌బక్సా? జోక్ చేస్తున్నారా? ప్రపంచంలోనే అత్యుత్తమ కాఫీగా పేరుగాంచిన మన 'అరకు' ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయడమే నా లక్ష్యం!" అని చెబుతూనే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు.
"ఈ వేసవి కల్లా అమెరికాలోనే మొట్టమొదటి 'అరకు కేఫ్' ని న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్ మన్ హట్టన్ లో ప్రారంభిస్తున్నాం. అప్పుడు చూడండి నా చేతిలో అరకు కాఫీ కప్పుతో సెల్ఫీలు!"
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరకు కాఫీని ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మహీంద్రా పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో మన కాఫీ రుచిని విదేశీయులకు పరిచయం చేయనున్నారు.
పారిస్ లో ఇప్పటికే సక్సెస్ అయిన అరకు కాఫీ, ఇప్పుడు అమెరికాను కూడా ఊపేయడానికి రెడీ అవుతోంది. మొత్తానికి మన అరకు కాఫీ ఘుమఘుమలు ఇక అమెరికా వీధుల్లో మోత మోగించనున్నాయన్నమాట!