ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మతవాద రాజకీయాలతో అట్టుడికిపోతున్నది. టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం వ్యక్తిగత విషయాలుగా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి తాను హిందువును అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడో లేక హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో కానీ, పులివెందుల ప్రాంతంలో నందీశ్వర ఆలయంలో విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
పూజా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు సంకల్పం తీసుకోవటానికి "ధర్మపత్నీ సమేతస్య" అంటారు కాబట్టి సతీసమేతంగా పాల్గొనాలి. కానీ జగన్ ఒంటికాయ శొంఠికొమ్ములా ఒక్కడే కూర్చున్నాడు, అది శాస్త్రరీత్యా సమ్మతం కాదు అనే విమర్శలు సహజంగానే వినిపిస్తున్నాయి.
అందులో భాగంగా, అశ్వమేధయాగం తలపెట్టినప్పుడు రాముడు ఒంటరిగా పాల్గొనకూడదు కాబట్టి స్వర్ణ సీతను పక్కన పెట్టుకుని యాగం నిర్వహించారు అంటూ హిందూమతాన్ని అనుసరించేవారు వివరిస్తున్నారు.మరొకప్రక్క కూటమిపార్టీలకు చెందిన సామాజిక మాధ్యమాలలో, ఈస్టర్ పండుగరోజును పవిత్రమైనదిగా భావించి ఆరోజున ప్రారంభమైన 'సాక్షి', పుట్టిన మూడు నెలలకే జీసస్ బొమ్మను ప్రచురించటంలో అపశృతి దొర్లిందని గమనించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఒక విశ్వాసిగా క్రైస్తవ సమాజానికి సాక్షి కుటుంబం తరఫున శతకోటి క్షమాపణలు చెబుతూ రాసిన లేఖను వైరల్ చేస్తున్నారు. భారతి రావటం, రాకపోవటం అనేది ఆమె వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి అది ఎవరూ మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆలయం వారు అభ్యంతరం చెప్పకపోవటాన్ని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొందరు. "నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను" అని జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు వచ్చిన వీడియోను వైరల్ చేస్తున్నారు మరికొందరు.
"మానవత్వమే నా మతం" అని చెప్పిన జగన్ ఇటువంటి వివాదాలు రాకుండా చూసుకుంటే బాగుండేది. నందీశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు జగన్ ఎలా చేశాడు అనేది పక్కన పెడితే, పూజా కార్యక్రమంలో "ముఖ్యమంత్రి పదవీ ప్రాప్తిరస్తు" అంటూ రాష్ట్ర పాలనా అవకాశ ప్రాప్తిరస్తు అని ఆశీర్వచనం చేయించుకున్నాడు. దానితో పాటు "దేశ పాలనా" అనే పదం కూడా ఉపయోగించారు. అంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా రావాలని జగన్ ఆశిస్తున్నాడా అనేది అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు ఆయన మతం పట్ల ఎవరికీ ఆసక్తి లేదు. రాజశేఖరరెడ్డి కుటుంబం క్రిస్టియానిటీని అనుసరిస్తుంది అని రెండు తెలుగురాష్ట్రాల ప్రజలకు తెలుసు. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు అని రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే జగన్ కు అర్థం అయ్యి ఉండాలి. 2014లో ఎన్నికలకు వెళ్లేముందు మతాన్ని గురించి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న కన్ఫ్యూజన్ లేదు. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయేటప్పటికి జగన్ లో తికమక ఆలోచనలు మొదలయ్యాయి.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి, జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఎలా మొదలయ్యిందో కానీ, ఆయన ఆధ్వర్యంలో రిషికేశ్ లోనో, ప్రయాగలోనో జగన్మోహన్ రెడ్డి హిందువుగా కన్వర్ట్ అయినట్లు ఒక వీడియోను వైరల్ చేశారు. ఆ విషయమై ఆయన ఎటువంటి ప్రకటనా ఇవ్వలేదు కానీ, స్వరూపానందేంద్ర స్వామి ఆశ్రమం మాత్రం వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన పలుకుబడిని సాధించింది. హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ వెళ్లే ఫ్లైట్ లో 90 శాతం ప్రయాణికులు రిషికేశ్ లోని శారదాపీఠం ఆశ్రమానికి వెళ్లేవారే ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో శారదాపీఠానికి విలువైన భూమిని కట్టబెట్టటం అందరికీ తెలిసిందే. ముందు ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చి, తరువాత దానిని కమర్షియల్ గా కన్వర్ట్ చేసుకోవటానికి అనుమతిస్తూ మరలా ప్రొసీడింగ్స్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రాగానే ఆ భూ కేటాయింపును రద్దు చేసింది.
అప్పట్లో కేసీఆర్ కూడా విశాఖ వచ్చి స్వామికి సాష్టాంగ దండప్రణామాలు చేసి, హైదరాబాదులో కూడా శారదా పీఠానికి భూమిని కేటాయించారు. అటువంటి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జగన్ కన్వర్ట్ అయినట్లున్న వీడియో వచ్చిన రోజు నుండే జగన్మోహన్ రెడ్డి మతం చర్చనీయాంశం అయింది. జగన్ నాలుగవతరం క్రిస్టియన్ అని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ రిపోర్ట్ వచ్చినప్పుడు విపరీతంగా హడావుడి చేసే అర్నాబ్ గోస్వామి, జగన్ క్రిస్టియన్ అంటూ డిక్లేర్ చేసేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన మతవివాదం అనేది ఎక్కువయింది. ఆయన కూడా ద్వైదీభావంలో కొట్టుమిట్టాడటం కనిపిస్తున్నది. తిరుమలలో అన్యమతస్తులు ప్రవేశించటానికి డిక్లరేషన్ సంస్కృతి ఉన్నది.
అది అన్యాయం అని వాదించేవారు ఉంటారు, కానీ అది అమలులో ఉన్నది. జగన్ తిరుమల వెళ్ళినప్పుడు ఆలయంలో డిక్లరేషన్ పైన సంతకం పెట్టమని ఆయన ముందు ఫార్మ్ పెట్టారు. కానీ ఆయన నిరాకరించారు. 'రిజెక్టెడ్' అని రాసిన ఆ ఫార్మ్ ఇప్పటికీ ఆలయ రికార్డ్స్ లో భద్రంగా ఉన్నది. తిరుమల సెట్ ను ఇంట్లోనే వేసుకోవటం, కొన్ని దేవాలయాలలో ప్రభుత్వం ఎప్పటినుండో పాటిస్తున్న ఆచారాలను పాటించకపోవటం జగన్ మతం గురించి చర్చలకు దారితీశాయి. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇవి చర్చకు రాలేదు. కారణం ఆయన తన మతం గురించిన క్లారిటీని మిస్ అవలేదు. అయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం దారుణంగా వ్యవహరించింది.
ఎవరి ఒత్తిడి ఫలితమో కానీ, 251 కోట్ల అవినీతి జరిగింది అనటమే కాక అది అసలు నెయ్యి కాదు అని నిర్ధారించిన సీబీఐ, ఆనాటి టీటీడీ పాలకమండలి చైర్మన్ లుగా ఉన్న జగన్ కుటుంబసభ్యులను నిందితులుగా చేర్చలేదు. వారిని నిందితులుగా చేర్చకుండా సీబీఐని నియంత్రించిన వారి గౌరవాన్ని కూడా జగన్ కాపాడలేదు. తన హయాంలో జరిగిన తప్పిదానికి ఒక్కసారి ప్రజలకు క్షమాపణ చెప్పి ఉంటే సరిపోయేది. కానీ హెరిటేజ్ ను కల్తీ వివాదంలోకి లాగే ప్రయత్నం చేసి వివాదాన్ని రావణకాష్టం చేసాడు. కూటమి ప్రభుత్వం కూడా సీబీఐ రిపోర్ట్ ప్రకారం జరిగిన అవినీతికి ఆనాటి చైర్మన్లను బాధ్యులను చేయకపోవడాన్ని ఛాలెంజ్ చెయ్యకపోవటమే ఆశ్చర్యం కలిగిస్తుంటే, ఆఫీసర్ల మీదకు వచ్చిన ఆరోపణలను తనవైపుకు వచ్చే పరిస్థితిని తానే కల్పించుకున్నాడు జగన్. రోజుకొక అబద్ధం చెప్పి, మరుసటి రోజుకు అది అబద్ధం అని నిరూపించే అవకాశం ఎదుటివారికి ఇవ్వటం వలన, పొరపాటున ఏదన్నా నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితిని కల్పించుకున్నాడు.
ప్రజల తరఫున నిలబడే వారే నాయకులు అవుతారు తప్ప, మతాలు రాజకీయనాయకులను బలోపేతం చేయలేవు. బీజేపీ హిందూమతాన్ని ప్రోత్సహిస్తుంది అంటారు. అధికారానికి ఏది రాచబాట వేస్తే దాన్ని అనుసరిస్తున్నారే కానీ, మతాన్ని మాత్రమే నమ్ముకుని రాజకీయాలు చేయటం లేదు బీజేపీ. జగన్మోహన్ రెడ్డి అది గమనించుకోవాలి.