బాలినేని రివెంజ్ పాలిటిక్స్: వైవీకి ఇక బ్యాడ్ టైమ్ షురూ?

admin
Published by Admin — February 28, 2026 in Politics, Andhra
News Image

రాజకీయాల్లో వెన్నుపోటులు, వ్యూహాలు కొత్త కాదు. కానీ, ఒకే కుటుంబానికి చెందిన బావమరుదుల మధ్య యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలైన సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఒకప్పుడు ఒకే గూటి పక్షులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. బాలినేని జనసేన కండువా కప్పుకున్నాక, వైవీ సుబ్బారెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన కంకణం కట్టుకుని మరీ రివెంజ్ తీర్చుకుంటున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

వీరి గొడవకు ప్రధాన బీజం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పడింది. ఉమ్మడి రాష్ట్రంలో వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో బిజీగా ఉన్నంత కాలం బాలినేని జిల్లాలో తిరుగులేని నేతగా వెలిగారు. కానీ, 2014 తర్వాత వైవీ ఏపీకి షిఫ్ట్ అవ్వడం, ఒంగోలు ఎంపీగా గెలవడంతో సమీకరణాలు మారిపోయాయి. అప్పటికే ఓడిపోయి ఉన్న బాలినేనికి, జిల్లా రాజకీయాల్లో వైవీ వేలు పెట్టడం ఏమాత్రం మింగుడు పడలేదు. తన ఇలాకాలో వైవీ పెత్తనం చేయడాన్ని బాలినేని తన ఉనికికే ప్రమాదంగా భావించారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలినేని మంత్రి అయ్యారు. కానీ కొద్ది కాలానికే ఆయన పదవి పోయింది. దీని వెనుక వైవీ సుబ్బారెడ్డి 'చక్రం' తిప్పారని బాలినేని బలంగా నమ్ముతున్నారు. జగన్ వద్ద తన గ్రాఫ్‌ను తగ్గించడంలో వైవీ కీలక పాత్ర పోషించారని, తనను రాజకీయంగా తొక్కేయడానికి ప్రయత్నించారని బాలినేని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తనకు అత్యంత సన్నిహితుడైన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపడంలో కూడా వైవీ హస్తం ఉందని బాలినేని అనుమానం.

కేవలం రాజకీయాలే కాదు, ఈ ఇద్దరి మధ్య ఆర్థిక పరమైన అంశాలు కూడా చిచ్చు పెట్టాయన్న ప్రచారం ఉంది. తనకంటే వైవీ సుబ్బారెడ్డి ఆర్థికంగా చాలా వేగంగా బలపడటం, పార్టీలో తనకు దక్కాల్సిన ప్రాధాన్యత వైవీకి దక్కడం బాలినేనిలో అసహనాన్ని పెంచింది. ఓడిపోయిన తర్వాత పార్టీలో తనకు గౌరవం తగ్గడానికి, జగన్ తనను దూరం పెట్టడానికి వైవీయే కారణమని డిసైడ్ అయిన బాలినేని, చివరకు జనసేన గూటికి చేరారు.

ఇక ఇప్పుడు టీటీడీ లడ్డూ కల్తీ వివాదం వైవీ సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుంది. సరిగ్గా ఇదే సమయాన్ని బాలినేని తన రివెంజ్ కోసం వాడుకుంటున్నారు. ``వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే ఆనందించే మొదటి వ్యక్తిని నేనే`` అంటూ బాలినేని తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో బాంబులా పేలాయి. ఒకప్పుడు బావ కోసం ప్రాణమిచ్చే స్థాయి నుండి, ఆయన జైలుకు వెళ్తే పండగ చేసుకునే స్థాయికి బాలినేని వెళ్లారంటే.. వైవీ చేసిన గాయం ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి, ఒకప్పుడు జగన్ కు రెండు కళ్లుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకరినొకరు రాజకీయంగా ఖతం చేసుకునే స్థాయికి చేరడం వైసీపీ క్యాడర్‌ను విస్మయానికి గురి చేస్తోంది. మ‌రి బాలినేని రివెంజ్ పాలిటిక్స్ వైవీని ఎంతటి ఇరకాటంలో నెడతాయో చూడాలి.

Tags
YV Subba Reddy Andhra Politics AP Politics Janasena YSRCP Balineni Srinivasa Reddy
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News