ప్రపంచ పటంలో ఎక్కడో పర్షియన్ గల్ఫ్ తీరంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సగటు భారతీయుడి వంటింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు కేవలం క్షిపణులకు మాత్రమే పరిమితం కాలేదు; అవి ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక వంటి `హోర్ముజ్ జలసంధి` వైపు మళ్లాయి. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించింది.. అదే హోర్ముజ్ మూసివేత. ఈ ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆసియా దేశాలను, ముఖ్యంగా భారతదేశాన్ని వణికిస్తోంది.
భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 55% కేవలం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటుంది. రోజుకు సుమారు 2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ హోర్ముజ్ కారిడార్ గుండానే మన తీరాలకు చేరుతుంది. అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు నిల్వ సామర్థ్యం కేవలం 74 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు సద్దుమణగక, జలసంధి మూసివేత కొనసాగితే.. ఆ 74 రోజుల తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిల్వలు అడుగంటితే దేశం అంధకారంలోకి వెళ్లడమే కాకుండా, రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉంది.
చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం మాత్రమే కాదు. ఇంధన ధరల పెరుగుదల ఒక చైన్ రియాక్షన్‌లా మారుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తయారీ రంగం కుదేలవుతుంది. ఇప్పటికే రూపాయి విలువ పడిపోతుండటంతో దిగుమతుల వ్యయం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో బ్రెంట్ ముడి చమురు ధరలు గనుక పెరిగితే, సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడం ఖాయం.
భారతదేశం తన విదేశీ మారక నిల్వలను కాపాడుకుంటూనే, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సేకరణపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. యుద్ధ మేఘాలు తొలగిపోకుంటే, రాబోయే రెండు నెలలు భారత్ ఆర్థిక వ్యవస్థకు అగ్నిపరీక్ష వంటివే. ఆ 74 రోజుల డెడ్ లైన్ ముగిసేలోపు దౌత్యపరమైన పరిష్కారం లభించకపోతే, సామాన్యుడికి చుక్కలు కనిపించడం ఖాయమనిపిస్తోంది.