ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ.. అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హతమ య్యారు. దీంతో ఇరాన్‌లో పాలన మారనుంది. ఖమేనీ వారసుడిని ఎంపిక చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇదిలావుంటే.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధం.. భారత్ పై ఏమేరకు ప్రభావం చూపిస్తుందన్నది ప్రశ్న. ఇక, భారత్‌కు ఇరాన్‌కు మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇకపై ఎలా ఉండనున్నాయన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం.
మిత్ర దేశం(friendly country)!
భారత్‌కు ఇస్లామిక్ దేశాల్లో ఉన్న మిత్ర దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. ఆది నుంచి ఇరాన్ తో భారత్‌కు మం చి సంబంధాలు ఉన్నాయి. ఎగుమతులు.. దిగుమతుల నుంచి సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకునే వరకు కూడా ఇరాన్‌తో భారత్‌కు అనేక సంబంధాలు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే.. విశాఖ నుంచి ఢిల్లీకి ఎంత దూరమో.. ఢిల్లీ నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు కూడా అంతే దూరం!. ఇది తరచుగా ఇరు దేశాల మధ్య చర్చకు కూడా వస్తూ ఉంటుంది.
అనేక ఒప్పందాలు..
ఇరాన్-భారత్ మధ్య అనేక భాగస్వామ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. భారత్- ఇరాన్ ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు. ఇటీవలి కాలంలో భారత్(India).. ఇరాన్ తో ఐదు అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలు సైతం చేసుకుంది. ఇరాన్‌కు భారతదేశం ఎగుమతులలో బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, ఫైబర్స్, విద్యుత్ యంత్రాలు, కృత్రిమ ఆభరణాలు ఎక్కువ చోటు దక్కించుకున్నాయి. ఇక, ఇరాన్ నుంచి భారత్‌కు 20-40 శాతం మధ్యలో ముడి చమురుదిగుమతి అవుతుంది. అలానే.. కార్పెట్లు, ఇతర వస్త్రాలు, ఆభరణాలు కూడా ఇరాన్ నుంచి మనకు వస్తాయి.
ఇప్పుడు ఏం జరిగింది?
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్(Iran) భారీగా దెబ్బతింది. అయితే.. ఇది ఊహించని ఘటనేమీ కాదు. ముందు నుంచి ఇరు పక్షాల మద్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే.. భారత్ ఈ విషయంలో తటస్థ వైఖరిని తీసుకుంది. ఇరు పక్షాలు కలిసి కూర్చుని చర్చించుకోవాలని పదే పదే చెప్పింది. అయితే.. ఇరాన్ ఎక్కడా ఈ విషయంలో భారత భాగస్వామ్యాన్ని కోరుకోకపోవడం గమనార్హం. ముఖ్యంగా మతాన్ని నమ్ముకుని.. మతాన్ని పట్టుకుని.. అదే ప్రధానమని భావించిన ఖమేనీ చివరి వరకు ఎవరి మాటా వినిపించుకోలేదన్న వాదన కూడా ఉంది.