సీఎం పదవికి నితీశ్ గుడ్ బై.. బీహార్ నెక్స్ట్ బాస్ ఎవ‌రు?

admin
Published by Admin — March 05, 2026 in Politics, National
News Image

బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను తన కనుసన్నలతో శాసించిన చాణక్యుడు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అనూహ్య నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, రాజ్యసభకు వెళ్తున్నానని ఆయన ప్రకటించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి పదవికి ఆయన గుడ్ బై చెప్పడంతో, ఇప్పుడు అందరి కళ్లు బిహార్ తదుపరి బాస్ ఎవరు? అనే ప్రశ్నపైనే ఉన్నాయి.

తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నితీశ్ కుమార్ ఎన్నో రికార్డులను సృష్టించారు. అయితే, ఆయన మనసులో ఒక తీరని కోరిక మిగిలిపోయింది. అసెంబ్లీ, కౌన్సిల్, లోక్‌సభ.. ఈ మూడింటికీ ప్రాతినిధ్యం వహించిన ఆయనకు, రాజ్యసభకు కూడా వెళ్లాలనేది చిరకాల వాంఛ. ``రాష్ట్రంలోని రెండు సభలతో పాటు, పార్లమెంట్‌లోని రెండు సభలకు ప్రాతినిధ్యం వహించాలనే నా కోరికను నెరవేర్చుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను`` అంటూ ఆయన పెట్టిన ఎక్స్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఇక‌పోతే ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. నితీశ్ కుమార్ తప్పుకోవడంతో పగ్గాలు ఎవరికి దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది. గత కొన్నాళ్లుగా కూటమిలో బీజేపీ బలం పెరుగుతూ వస్తోంది. నితీశ్ స్వయంగా ``కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు ఉంటుంది`` అని ప్రకటించడంతో, ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతల పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

నితీశ్ కుమార్ నిర్ణయం కేవలం బిహార్‌కే పరిమితం కాదు. 2024 ఎన్నికల తర్వాతి పరిణామాల నేపథ్యంలో, ఆయన రాజ్యసభకు వెళ్లడం అంటే కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితీశ్, కేంద్ర మంత్రివర్గంలో చేరతారా లేక రాజ్యసభ వేదికగా ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో కీలకం కానున్నారా అనేది చూడాలి. ఏది ఏమైనా, నితీశ్ తీసుకున్న ఈ మాస్టర్ స్ట్రోక్ బిహార్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది.

Tags
Nitish Kumar Bihar Politics Bihar CM Rajya Sabha JDU BJP Bihar
Recent Comments
Leave a Comment

Related News