జనసేన మార్చి నెలలో ప్లీనరి సమావేశాలను జరపనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉనికిలో ఉన్నప్పటికీ 2024లో నుంచి అధికారాన్ని రుచి చూస్తున్నది. అందువల్ల, ఈ పార్టీపైన కొంత లోతైన విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
1950వ దశకం నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ‘కాపు’ సామాజికవర్గం సాంప్రదాయకంగా కాంగ్రెసుకు బలమైన ఓటుబ్యాంకు. అయితే 2014లోనే తొలిసారిగా తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అందువల్ల కోస్తాంధ్రలోని కమ్మ, కాపు కులాల మధ్య ఉన్న వైరం మైత్రిగా మారింది. ఫలితంగా తొలిసారి తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం నుంచి 60% ఓట్లకు పైగా పొందింది. ఇది అనుహ్యమైన ఓటు బ్యాంకు కాబట్టి ఈ అంశాన్ని విశ్లేషించాలి.
కమ్మ, కాపు మధ్య ఉన్న సామాజిక వైరుధ్యాలు రాజకీయంగా 1980వ దశకంలో స్పష్టంగా బయటపడ్డాయి. 1982లో వంగవీటి మోహనరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాపునాడును ఏర్పాటు చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఈ రెండు రాజకీయ సంఘటనలకు కేవలం 8 నెలల తేడా మాత్రమే. అయితే కాపునాడు కాంగ్రెసుకు అనుబంధంగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి దగ్గర కాలేకపోవడమే కాకుండ, ఆ పార్టీ విజయాన్ని ఆపలేక పోయింది. తదనాంతర పరిణామాలు ఈ వైరుధ్యాలను ఇంకా జటిలం చేశాయేగాని ‘సామాజిక మైత్రి’కి మాత్రం దారులు వేయలేకపోయాయి.
1990వ దశకంలో ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు పార్టీ పెడతానని ప్రకటించిన వెంటనే కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేయడంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. 1992-93లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, వెనుకబడిన కులాలకు 27% రిజేర్వేషన్లు కేంద్రభ్రుత్వ ఉద్యోగాలల్లో అమలు ప్రారంభమైంది. అయితే కొంతకాలానికి కాంగ్రెసు నేత ముద్రగడ పద్మనాభం ‘కాపుల’ను ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలాని ఆందోళన ప్రారంభించారు. చాలా కాలంపాటు కాపుల డిమాండ్‌కు పెద్దగా రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించలేదు.
ఇటువంటి సందర్భంలో జనసేనకి అనేక సవాళ్ళు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు పార్టీ కోస్తాంధ్ర కాపు సామాజిక వర్గానికి పరిమితమైంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఎన్డీయే మంత్రివర్గంలో చేరనున్నట్లు ప్రకటించారు. అందువల్ల ఇప్పటికీ కుటుంబ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రంలో మరొక ‘కొణిదెల కుటుంబ’ పార్టీ చేరునుంది. టీడీపీ, బీజేపీ కూటమిలో చేరడం వల్ల కమ్మ, వెనుకబడిన జాబితాలో ఉన్న శెట్టి బలిజల ఓట్లు జనసేనకు వచ్చాయి. అదే విధంగా కాపుల ఓట్లు కూటమికి వచ్చాయి. అయితే జనసేనలో వెనుకబడిన కులాలకు దళితులకు ప్రాధాన్యత లేదని మరొక విమర్శ ఉంది. అంతేకాకుండా కూటమిలో భాగస్వామ్యమైతేనే కొన్ని సీట్లు గెలవగలుగుతుంది. కూటమి విచ్ఛిన్నమైతే ఓటమి పాలవుతుందని 2019 ఎన్నికలు తేల్చాయి. ఇటువంటి గడ్డు పరిస్థితులల్లో జనసేనఎంతకాలం కూటమిలో కొనసాగుతుంది. ఒక వేళ కొనసాగిన పార్టీ కార్యకర్తలు అందుకు సిద్ధంగా ఉన్నారా? వామపక్ష పదజాలంతో మొదలై సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ ఏ దిశలో నడిపించనున్నారు. ఇటువంటి విషయాలకు సమాధానం లేక పార్టీ సిద్ధాంతకర్తలు, వ్యూహకర్త తలపట్టుకున్నట్టు వినికిడి.