అటు వెళ్లలేక.. ఇటు ఉండలేక.. జగన్ రెడ్డి ‘మత’ సంకటం!

admin
Published by Admin — March 05, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు క‌ల్తీ నెయ్యి కంటే మతం చుట్టూ జరుగుతున్న చర్చలే సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా శాసనమండలి వేదికగా జరిగిన హైడ్రామా చూస్తుంటే, వైసీపీ తనంతట తానుగా ప్రత్యర్థి విసిరిన వ్యూహాత్మక వలలో చిక్కుకుపోయిందనిపిస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంపై చర్చ జరుగుతున్న వేళ, తెలుగుదేశం పార్టీ అత్యంత చాకచక్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మతపరమైన గుర్తింపును తెరపైకి తెచ్చి వైసీపీని కోలుకోలేని డిఫెన్స్‌లో పడేసింది.

సభలో చర్చాంశం నెయ్యి నాణ్యత గురించి సాగుతుండగా, మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కసారిగా రూటు మార్చారు. మండలి చైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి.. ``మీరు, మీ నాయకుడు (జగన్) క్రిస్టియన్లు`` అని సంధించిన అస్త్రం వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇక్కడ అచ్చెన్నాయుడు ప్లాన్ చాలా స్పష్టం. తిరుమల వంటి హిందూ సెంటిమెంట్ ఉన్న అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు, జగన్ మతాన్ని హైలైట్ చేయడం ద్వారా ఆయనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే అవకాశం దొరుకుతుందని టీడీపీ భావించింది. అనుకున్నట్లుగానే వైసీపీ సభ్యులు ఆ ట్రాప్‌లో పడి గందరగోళానికి గురయ్యారు.

చైర్మన్ ఇచ్చిన క్లారిటీ.. జగన్ విషయంలో మౌనం!
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు చైర్మన్ మోషేన్ రాజు వెంటనే స్పందిస్తూ.. తన పేరులో మోషేన్ ఉన్నంత మాత్రాన తాను క్రిస్టియన్‌ను కాదని, తాను హిందువునేనని గట్టిగా చెప్పుకోగలిగారు. కానీ, అసలు సంకటం ఇక్కడే మొదలైంది. చైర్మన్ తన గురించి తాను క్లారిటీ ఇచ్చుకున్నారు కానీ, తన నాయకుడు జగన్ రెడ్డి మతం గురించి మాత్రం ఆ స్థాయిలో స్పష్టత ఇచ్చే ధైర్యం ఏ ఒక్క వైసీపీ సభ్యుడు చేయలేకపోయారు. త‌మ‌ నాయకుడు హిందువు అని చెప్పలేక, అలాగని క్రిస్టియన్ అని గర్వంగా చాటుకోలేక వైసీపీ ఎమ్మెల్సీలు ప్రదర్శించిన మౌనం.. జగన్ రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది.

అచ్చెన్నాయుడు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని భీష్మించుకోవడంతో, జగన్ క్రిస్టియన్ అనే అంశం అధికారికంగా మండలి రికార్డుల్లోకి చేరింది. ఒకవైపు తాను హిందూ సంప్రదాయాలను గౌరవిస్తానని చూపేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు సభలో ఆయన మతంపై జరిగిన ఈ రచ్చ ఆయన రాజకీయ వ్యూహాలకు గొడ్డలి పెట్టుగా మారింది. వైసీపీ వ్యూహకర్తలు ఈ అంశాన్ని పక్కదారి పట్టించాల్సింది పోయి, అనవసర వాదనలతో అది చర్చనీయాంశం అయ్యేలా చేసి పెద్ద పొరపాటే చేశారు.

రాజకీయాల్లో స్పష్టత అనేది చాలా ముఖ్యం. అటు తన క్రైస్తవ మూలాలను బహిరంగంగా ఓనర్ చేసుకోలేక, ఇటు హిందువుల నమ్మకాన్ని పూర్తిస్థాయిలో చూరగొనలేక జగన్ రెడ్డి ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ లో చిక్కుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ మేనేజ్ చేసినా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ మతపరమైన అస్పష్టతే ఆయనకు పెద్ద మైనస్‌గా మారుతోంది. మొత్తానికి మండలి వేదికగా జరిగిన ఈ పరిణామం జగన్ రెడ్డిని రాజకీయంగా మత సంకటంలో పడేసిందనేది వాస్తవం.

Tags
YS Jagan AP Council AP Politics YSRCP TDP Andhra Pradesh Tirumala Ladoo
Recent Comments
Leave a Comment

Related News