తమిళనాడు నెక్స్ట్ `సీఎం` ఎవరో చెప్పేసిన కేకే సర్వే!

admin
Published by Admin — March 11, 2026 in Politics, National
News Image

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. ద్రవిడ గడ్డపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది? కోటపై కొలువుదీరే కొత్త రాజు ఎవరు? అనే ఉత్కంఠకు తెరతీస్తూ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సంస్థ `పారావీల్‌ కేకే సర్వేస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌` (KK Survey) సంచలన విశ్లేషణను వెలువరించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాస్త్రీయ సర్వేలో తమిళ ఓటరు నాడి స్పష్టంగా బయటపడింది.

సర్వే ఫలితాల ప్రకారం.. తమిళనాడులో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే (DMK) ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. సుమారు 41.5 శాతం మంది ఓటర్లు స్టాలిన్ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన మద్దతును డీఎంకే కూడగట్టుకుంటోందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా డెల్టా జిల్లాలు మరియు ఉత్తర తమిళనాడులో స్టాలిన్ హవా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK) కూడా వెనక్కి తగ్గడం లేదు. 36.2 శాతం ఓట్లతో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఉంది. అయితే, ఈసారి ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK). తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ 13.6 శాతం ఓట్లతో మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించనుందని సర్వే బాంబు పేల్చింది. ముఖ్యంగా చెన్నై మహానగరంలో విజయ్ పార్టీకి భారీగా సీట్లు వచ్చే అవకాశం ఉందని, యువత మరియు కొత్త ఓటర్లు దళపతి వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే సీఈఓ కిరణ్ కొండేటి వెల్లడించారు. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి (NTK) సైతం 7.9 శాతం ఓట్లతో తన బలాన్ని నిరూపించుకోనుంది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగే ఈ పార్టీ, కీలక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల గెలుపు ఓటములను శాసించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక‌పోతే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ముందే ఊహించి ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన చరిత్ర ఈ స‌ర్వే సంస్థకు ఉంది. తాజాగా 234 నియోజకవర్గాల్లో బూత్ స్థాయి వరకు వెళ్లి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు కిరణ్ కొండేటి తెలిపారు. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తానికి, తమిళనాడులో మరోసారి ద్రవిడ రాజకీయం ఆసక్తికరమైన మలుపులు తిరగబోతోంది.  మ‌రి స్టాలిన్ తన కోటను కాపాడుకుంటారా? లేక విజయ్ ఏమైనా అద్భుతం చేస్తారా? అనేది చూడాలి.

Tags
KK Survey Tamil Nadu Next CM Tamil Nadu Politics AIADMK DMK TVK TN Election 2026
Recent Comments
Leave a Comment

Related News