డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ రాజకీయాల్లో లెక్కల కంటే దూకుడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు. కానీ, ఇప్పుడు ఇరాన్ విషయంలో ఆయన వేసిన అడుగు అతి తెలివిగా మారిందా? అంటే.. అమెరికా జాతీయ భద్రతాధికారులే అవును అనే తల పట్టుకుంటున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అరికట్టాలనే నెపంతో మొదలైన ఈ యుద్ధం, ఇప్పుడు అమెరికా ఆర్థిక మూలాలనే దెబ్బతీస్తోంది. ఏడాది మొత్తం వాడాల్సిన దేశ బడ్జెట్‌ను ఒక్క ఇరాన్ యుద్ధానికే తగలేయడంపై అగ్రరాజ్యంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
అసలు ఇరాన్‌పై ట్రంప్ ఎందుకు కక్షగట్టారు? పైకి అణ్వాయుధాల తనిఖీ అని చెబుతున్నా, తెరవెనుక అసలు కథ నల్ల బంగారం (చమురు). ఇరాన్ చమురు నిల్వలపై గుత్తాధిపత్యం సాధించాలన్నది ట్రంప్ మాస్టర్ ప్లాన్. దీనికి ఇరాన్ అంగీకరించకపోవడమే యుద్ధానికి పునాది పడింది. ఇరాన్ అంతర్గతంగా హిజాబ్ నిరసనలతో అట్టుడుకుతున్న వేళ, దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ట్రంప్ భావించారు. ఖమేనీ పాలనను అంతం చేసి, తమకు అనుకూలమైన వ్యక్తిని గద్దెనెక్కించాలనే ఆశ ఇప్పుడు అమెరికాకు శాపంగా మారింది.
యుద్ధం మొదలైతే ఇరాన్ భయపడి లొంగిపోతుందని ట్రంప్ వేసిన అంచనా తలకిందులైంది. ఖమేనీని హతమార్చిన తర్వాత ఇరాన్ మరింత రెచ్చిపోయింది. ప్రపంచ రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుని నౌకలను నిలిపివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. అటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ట్రంప్ చేసిన పనికి ఇప్పుడు అమెరికా సైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాణేనికి ఒకవైపు చూసి నిర్ణయం తీసుకోవడం అంటే ఇదే అంటూ అమెరికా కాంగ్రెస్ నేతలు ట్రంప్‌ను ఏకిపారేస్తున్నారు. అగ్రరాజ్యం ఇమేజ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో డ్యామేజ్ అయ్యింది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ యుద్ధాన్ని ఆపాలని అమెరికాపై ఒత్తిడి తెస్తున్నాయి. దూకుడుగా వెళ్లిన ట్రంప్, ఇప్పుడు వెనక్కి తగ్గలేక.. ముందుకెళ్లలేక సతమతమవుతూ ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డారు.