సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లంటే కొత్త జంట డ్రెస్సింగ్, ఫంక్షన్ గ్రాండియర్ గురించి మాట్లాడుకుంటారు. కానీ, మెగా హీరో అల్లు శిరీష్ పెళ్లి విషయంలో మాత్రం సీన్ కొంచెం డిఫరెంట్‌గా జరిగింది. ఆయన వేసుకున్న బట్టల కంటే, ఆయన ధరించిన నగలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. నెటిజన్లు, మీమ్స్ రాయుళ్లు శిరీష్ ఫ్యాషన్ సెన్స్‌పై రకరకాల కామెంట్స్ చేయగా.. వాటన్నింటికీ ఆయన తనదైన శైలిలో మాస్ రిప్లై ఇచ్చారు.
శిరీష్ తన పెళ్లి వేడుకల్లో విభిన్నమైన నెక్లెస్‌లు, చోకర్లు ధరించి కనిపించారు. దీనిపై ``మగాళ్లు కూడా ఇలాంటి నగలు వేసుకుంటారా?`` అని కొందరు ట్రోల్ చేయగా.. శిరీష్ హిస్టరీ పాఠాలు గుర్తు చేశారు. ``వందల ఏళ్ల క్రితం మన భారతీయ రాజులు, మొఘల్ చక్రవర్తులు భారీ ఆభరణాలు ధరించేవారు. అది మన సంస్కృతిలో భాగం. అబ్బాయిలు అంటే నీలం, అమ్మాయిలు అంటే పింక్ అనే విభజన ఈ మధ్య కాలంలో వచ్చిందే తప్ప ప్రాచీన కాలంలో లేదు`` అని ఆయన స్పష్టం చేశారు.
అదేసమయంలో ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇస్తూ.. ``ఏది మగతనమో, ఏది ఆడతనమో నాకు ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏం ధరించాలి అనేది నా ఇష్టం. నా వ్యక్తిత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది`` అని శిరీష్ తేల్చి చెప్పారు. కేవలం షర్టులు, ప్యాంట్లు వేసుకుంటేనే మగతనం అనుకోవడం పొరపాటని, ఫ్యాషన్ విషయంలో ప్రయోగాలు చేసే ధైర్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రయోగం వెనుక ఒక సామాజిక ఉద్దేశ్యం కూడా ఉందని శిరీష్ చెప్పుకొచ్చారు. ``మనం కూడా ఇలాంటి కొత్త మార్పులు చేయడానికి భయపడితే, మరో 20 ఏళ్లయినా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అందుకే ట్రోల్స్ వస్తాయని తెలిసినా, ఆ పాతకాలపు ఆలోచనలను బ్రేక్ చేయాలనే నేను ఇలా సిద్ధమయ్యాను`` అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ఇంట్లో వారు కూడా మొదట సందేహించినా, తన క్లారిటీతో వారిని కూడా ఒప్పించానని శిరీష్ వివరించారు. మొత్తం మీద అల్లు శిరీష్ కేవలం ఒక పెళ్లి కొడుకుగా మాత్రమే కాకుండా, ఫ్యాషన్ ప్రపంచంలో జెండర్ సరిహద్దులను చెరిపేసే ఒక ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలిచారు.