స్కూలు పిల్లలు శోభనపు పెళ్ళికొడుకులా? గరికపాటిపై నెటిజన్లు ఫైర్!

admin
Published by Admin — March 21, 2026 in Andhra, Telangana
News Image

అనర్గళమైన వాగ్ధాటి, అపారమైన పాండిత్యం.. ఇవీ గరికపాటి నరసింహారావుకి ఉన్న గుర్తింపు. అయితే, అప్పుడప్పుడు ఆయన నోటి వెంట వచ్చే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన గౌరవానికే భంగం కలిగిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సంక్షేమ పథకాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా రాజ్జుకున్నాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే క్రమంలో ఆయన వాడిన `` శోభనపు పెళ్ళికొడుకులు`` అనే పదం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది.

ప్రభుత్వం ఇచ్చే బట్టలు, పుస్తకాలు, భోజనం వంటి సౌకర్యాల వల్ల పిల్లలకు చదువుపై శ్రద్ధ తగ్గుతుందని గరికపాటి అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం మానేసి, కోడిగుడ్ల లెక్కలు చూసుకోవడానికే సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ క్రమంలో స్కూలుకు వచ్చే పిల్లలను పెళ్లికొడుకులతో పోల్చడం నెటిజన్లను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. ఒక పండితుడి నోటి నుంచి రావాల్సిన మాటలేనా ఇవి? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.

లక్షలాది మంది పేద విద్యార్థులు బడికి వస్తున్నారంటే, దానికి ప్రధాన కారణం అక్కడ లభించే మధ్యాహ్న భోజనం. ఆ ఒక్క పూట అన్నం కోసం కిలోమీటర్ల దూరం నడిచి వచ్చే చిన్నారులు ఎందరో ఉన్నారు. అటువంటి వారి ఆకలిని, వారి అవసరాలను కించపరిచేలా మాట్లాడటం అమానవీయమని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన మధ్యాహ్న భోజన పథకాన్ని అపహాస్యం చేయడం గరికపాటి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనూ గరికపాటి మహిళల వస్త్రధారణపై, సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఏకంగా పసిపిల్లలను ఉద్దేశించి అసభ్యకరమైన పోలికలు వాడటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పిల్లల్లో బాధ్యత పెంచాలనే మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వాడే పదజాలం సంస్కారవంతంగా ఉండాలి కదా? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక గురువుగా సమాజానికి దిశానిర్దేశం చేయాల్సింది పోయి, ఇలాంటి వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకోవడం ఆయన స్థాయికి తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags
Garikapati Narasimha Rao Garikapati Controversy Telugu News Mid Day Meal Education
Recent Comments
Leave a Comment

Related News