ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పరిశ్రమల రాక వేగం పుంజుకుంటోంది. తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్(Arcelor Mittal Steel Plant) ఏర్పాటుకు అడుగులు పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ భారీ ప్రాజెక్టు వార్త బయటకు రాగానే వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. `` అది మా చలువే.. మా జగనన్న పుణ్యమే`` అంటూ సరికొత్త పిట్టకథలు వినిపిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్క పరిశ్రమను కూడా సరిగ్గా పట్టాలెక్కించని వారు, ఇప్పుడు పక్కనోడు పండించిన పంటకు మేమే విత్తనం వేశామంటూ క్రెడిట్ కోసం ఆరాటపడటం చూస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ(YCP) అగ్రనేత నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ఎవరూ నోట పరిశ్రమలు, పెట్టుబడులు అన్న మాట రాలేదు. అప్పుడు కేవలం బటన్ నొక్కాం.. డబ్బులు పంచాం అన్న ముచ్చట తప్ప, ఫలానా పరిశ్రమ తెచ్చాం అన్న ధైర్యం వారికి లేకపోయింది. తీరా ఇప్పుడు మిట్టల్ ప్లాంట్ పనులు మొదలవుతుంటే, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వారు పాత ఫైళ్లు పట్టుకుని బయటకొస్తున్నారు. దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్తో జగన్ గారు టీ తాగారు కాబట్టే ఈ ప్లాంట్ వస్తోందని చెప్పడం చూస్తుంటే, వారి క్రెడిట్ దాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ హయాంలో ఏపీ(AP)లో పారిశ్రామిక వేత్తల పరిస్థితి చూడలేక చచ్చాం అన్నట్టుగా ఉండేది. ఉన్న అమరరాజా వంటి సంస్థలను పొరుగు రాష్ట్రాలకు తరిమేసిన అపవాదు మూటగట్టుకున్న ఆ ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా వచ్చే పెట్టుబడులు మావే అనడం హాస్యాస్పదం. నాడు నక్కపల్లిలో 4 వేల ఎకరాలు చూపించామని చెబుతున్న నేతలు, మరి అదే హయాంలో పనులు ఎందుకు మొదలుపెట్టించలేకపోయారో సమాధానం చెప్పలేకపోతున్నారు. నోటిఫికేషన్ సమయంలోనే స్పష్టత వచ్చిందని ఇప్పుడు చెప్పడం, గాలిలో దీపం పెట్టి నాదే వెలుగు అన్నట్లుగా ఉంది.
నాడు నవరత్నాలే మా లక్ష్యం అన్నట్లు పాలన సాగించిన వైసీపీ, పరిశ్రమల విషయంలో చేతులెత్తేసిందన్నది బహిరంగ రహస్యం. పెట్టుబడుల సదస్సుల పేరుతో విశాఖలో చేసిన హడావుడి మినహా, క్షేత్రస్థాయిలో ఒరిగింది శూన్యమని జనం భావించారు కాబట్టే ఎన్నికల్లో గట్టి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు అధికారం పోయి రెండేళ్లు కావస్తున్నా, ఏ చిన్న మంచి పని జరిగినా అది జగనన్న(Jagan) చలువే అని సొంత పత్రికలో డిబేట్లు పెట్టడం కేవలం ఆత్మవంచనే అవుతుంది. అసలు నిజం ఏమిటంటే.. ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా, పారిశ్రామిక అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. అంతే తప్ప, గతంలో వేసిన ఉత్తిత్తి పునాదుల వల్ల కాదు. వైసీపీ నేతలు ఈ పిట్టకథలు ఆపేసి, కనీసం ఇప్పుడైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు.