ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల అంటే కేవలం ఒక నియోజకవర్గం కాదు.. అది వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా తిరుగులేని కంచుకోట. ప్రత్యర్థులు ఎవరైనా, గాలి ఎటు వీచినా అక్కడ గెలుపు గుర్రం మాత్రం వైఎస్ వారసులదే. అయితే, రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ పరిస్థితి తలకిందులు కాబోతుందా? కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ జగన్ మోహన్ రెడ్డిని తన సొంత గడ్డపైనే ఇరకాటంలో పెట్టబోతుందా? అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా 33 శాతం స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఏ నియోజకవర్గం మహిళా కోటాలోకి వెళ్తుందనేది అత్యంత కీలకం. ఒకవేళ వ్యూహాత్మకంగా పులివెందుల నియోజకవర్గాన్ని మహిళా కోటాకు కేటాయిస్తే, జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అక్కడ నుంచి నేరుగా పోటీ చేసే అవకాశం కోల్పోతారు. తన సొంత గడ్డపై పోటీ చేయలేక, వేరే నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి రావడం అనేది జగన్ రాజకీయ ప్రస్థానంలోనే అతిపెద్ద సవాలుగా మారవచ్చు.
కేవలం రిజర్వేషన్లే కాదు, నియోజకవర్గాల సరిహద్దుల మార్పు కూడా వైసీపీ(YCP)కి పెద్ద తలనెప్పిగా మారనుంది. అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుండి 263కి పెరిగే క్రమంలో, ప్రస్తుతం వైసీపీకి పటిష్టంగా ఉన్న ఓటు బ్యాంకును విడగొట్టేలా కొత్త మ్యాప్‌లు సిద్ధమవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీ బలంగా ఉన్న మండలాలను విడదీసి, వేర్వేరు నియోజకవర్గాల్లో కలపడం ద్వారా ఆ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన డీలిమిటేషన్ కాంగ్రెస్‌కు ఎలా కలిసి వచ్చిందో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన అనుభవంతో అదే అస్త్రాన్ని వైసీపీపై ప్రయోగించే అవకాశం ఉంది.
జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండే కీలక నేతల నియోజకవర్గాలను సామాజిక సమీకరణాల పేరుతో మార్చడం లేదా ఎస్సీ/ఎస్టీ రిజర్వుడు కోటాలోకి తీసుకురావడం ద్వారా వారిని రాజకీయంగా దెబ్బతీయవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం 11 సీట్లతో ఉన్న వైసీపీకి, రాబోయే ఈ మార్పులు కోలుకోలేని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. కొత్తగా ఏర్పడే 88 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం తన బలాన్ని పెంచుకుంటూ, వైసీపీ మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మరి డీలిమిటేషన్ అనే ఈ పొలిటికల్ సర్జరీ ఏపీ రాజకీయ మ్యాప్‌ను ఎలా మార్చబోతోంది? జగన్(Jagan) తన కంచుకోటను కాపాడుకుంటారా? లేక కొత్త వ్యూహాలతో వేరే నియోజకవర్గానికి మారుతారా? అనేది కాలమే నిర్ణయించాలి