ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో దాదాపు 3500 కోట్ల రూపాయల మేరకు దారిమళ్లాయని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టింది. దీనిని విచారించేందుకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న(ఏ1) కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఉరఫ్ రాజ్ కసిరెడ్డి గత ఏడాది ఏప్రిల్ నుంచి రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే.. తాజాగా ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దీనికి సంబంధించి పలు షరతులు విధించింది. ఎట్టిపరిస్థితిలోనూ విదేశాలకు వెళ్లరాదని.. పాస్‌పోర్టును స్వాధీన పరచాలని.. కేసుకు సంబంధించి ఎవరితోనూ ఎలాంటి సమాచారం పంచుకోరాదని.. మీడియా ముందుకు రాకూడదని స్పష్టం చేసింది. ఇదేసమయంలో లక్ష రూపాయల చొప్పున పూచీకత్తులు సమ ర్పించాలని ఆదేశించింది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే.. తక్షణమే బెయిల్ రద్దు అయినట్టుగా అధికారులు భావించి ఆయనను అరెస్టు చేయొచ్చని పేర్కొంది.
ఎవరీ కసిరెడ్డి?
కడప జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయిన ఆయన.. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్ లో సిట్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం.. విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కాగా.. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని, తనను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని కసిరెడ్డి వాదిస్తున్నారు.
వందల కోట్ల ఆస్తులు..
మద్యం కేసులో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారని.. పోలీసులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆస్తులను గత ఏడాది సీజ్ చేశారు. ఇటీవల రాజ్ కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను కూడా సీజ్ చేయడం గమనార్హం.