అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) శైలి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. క్రమశిక్షణ, నిబద్ధత విషయంలో ఆయన సొంత పార్టీ వారైనా, మంత్రులైనా సరే రాజీ పడరనేది జగమెరిగిన సత్యం. తాజాగా అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ ఇందుకు వేదికైంది. కేబినెట్ మీటింగ్లో మంత్రులపై బాబు సీరియస్ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా కేబినెట్(AP Cabinet) ఎజెండా అనేది అత్యంత గోప్యంగా ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే వరకు ఆ నిర్ణయాలు బయటకు రాకూడదు. కానీ, సమావేశం ప్రారంభం కాకముందే కీలక అంశాలు మీడియాలో ప్రత్యక్షమవ్వడం చంద్రబాబును విస్మయానికి గురిచేసింది. "ప్రభుత్వ రహస్యాలకు విలువేది? కనీస క్రమశిక్షణ లేకపోతే ఎలా?" అంటూ ఆయన మంత్రులను సూటిగా ప్రశ్నించారు. ఈ లీకుల వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు గత చరిత్రను వెలికితీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP)లో గతంలో ఇలాగే కేబినెట్ లీకులు జరిగినప్పుడు, దివంగత నేత ఎన్టీఆర్ ఏకంగా తన మంత్రివర్గాన్నే రద్దు చేసిన ఉదంతాన్ని గుర్తుచేస్తూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. "తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. బాధ్యత వహించక తప్పదు" అని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడనని క్లియర్ కట్ మెసేజ్ పంపారు.
మరోవైపు, కేబినెట్ సమావేశం సాగుతున్నా మంత్రుల చేతికి ఎజెండా కాపీలు అందకపోవడంపై కూడా చర్చ నడిచింది. మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఈ విషయాన్ని ప్రస్తావించగా, అధికారుల పనితీరుపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిస్టమ్ అనేది సరళంగా ఉండాలి తప్ప, మంత్రులను అయోమయానికి గురిచేసేలా ఉండకూడదని హితవు పలికారు. సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి, ఈ కేబినెట్ భేటీ కేవలం నిర్ణయాలకే పరిమితం కాకుండా, అటు మంత్రులకు, ఇటు అధికారులకు ఒక పవర్ఫుల్ వార్నింగ్ బెల్ లా పనిచేసింది.