సాయిరెడ్డి కొత్త మీడియా.. పేరేంటో తెలుసా?

admin
Published by Admin — April 11, 2026 in Politics, Andhra
News Image

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy) కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించే సాయిరెడ్డి, ఇటీవ‌లె రాజకీయ క్షేత్రం నుండి వైదొలిగారు. అయితే ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించి సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. సాధారణంగా రాజకీయ నాయకులు మీడియా సంస్థలు స్థాపించడం కొత్తేమీ కాదు. ఈ జాబితాలో సాయిరెడ్డి కూడా చేర‌బోతున్నారు.

తమ సంస్థ ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదని, కేవలం ప్రజల పక్షాన నిలబడుతుందని తాజాగా సాయిరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే త‌మ సంస్థ‌ ప్రధాన లక్ష్యమని.. వారి గొంతుకను వినిపిస్తామ‌ని స్పష్టం చేశారు. తొలుత తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను(Digital Media) సిద్ధం చేస్తున్న‌ట్లు పేర్కొన్న‌ ఆయన, ఆ తర్వాత పూర్తిస్థాయి శాటిలైట్ న్యూస్ ఛానెల్‌ను తీసుకురాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్పటికే వెబ్ పోర్టల్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

అయితే ఈ సంస్థ పేరు విషయంలో సాయిరెడ్డి(Sai Reddy) అత్యంత గోప్యత పాటిస్తున్నారు. కాగా, మైక్ పట్టుకుని విమర్శలు చేసిన నాయకుడు, ఇప్పుడు కలం పట్టి వ్యవస్థలోని లోపాలను ఎలా ప్రశ్నిస్తారో చూడాలి. త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం కానున్న ఈ మీడియా సంస్థ పేరు, లోగోపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఈ సీనియర్ నేత, జర్నలిజంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాల్సిందే.

Tags
Vijay Sai Reddy VS Reddy YSRCP AP News Andhra Pradesh Media Venture
Recent Comments
Leave a Comment

Related News