త్వరలోనే ఏపీ(AP)లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు.. స్థానిక ఎన్నికల కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో పార్టీలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే వరుస భేటీలతో టీడీపీ పుంజుకునేదిశగా అడుగులు వేస్తోంది. కార్యకర్తలకు కూడా శిక్షణ ఇస్తూ.. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను వేగం చేసింది.
ఇక, జనసేన(Janasena) కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలకు లక్ష్యాలను నిర్దేశించింది. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా.. కూటమి నాయకులను గెలిపించే బాధ్యతను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అందరికీ అప్పగించా రు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రతి వార్డునూ.. ప్రతి కౌన్సిల్‌నూ గుప్పిట పట్టాలన్నారు. ఇలా.. ఈ రెండు పార్టీలు పుంజుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను వెతుకుతున్నాయి. మరి వైసీపీ మాటేంటి అనేది ప్రశ్నగా మారింది.
ఇప్పటి వరకు వైసీపీ(YCP) ఈ దిశగా అడుగులు వేయలేదన్నది వాస్తవం. పార్టీ తరఫున వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గాల సమీక్ష చేస్తున్నా.. ఎక్కడా స్థానిక ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేయడం లేదు. నాయకులకు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించడం లేదు. పైగా.. ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. ఓ పత్రికపై నిరసన వ్యక్తం చేయడం వంటివాటిని తీవ్రంగా భావిస్తున్నారు తప్ప.. క్షేత్రస్థాయిలో నాయకులు కోరుకుంటున్న విధంగా పార్టీని నడిపించలేక పోతున్నారు.
దీనికి రెండు కారణాలు కనిపిసున్నాయి. ఒకటి క్షేత్రస్తాయిలో కార్యకర్తల బలం తగ్గిందన్నది వాస్తవం. దీంతో ఇప్పుడు ఆ విషయంపైనే జగన్(Jagan) దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇక రెండోది స్థానిక సంస్థల్లో ఎలానూ ప్రత్యర్థి పక్షం గెలిచే అవకాశం ఉండదు కాబట్టి ఆయన దానిని వదిలేశారని తెలుస్తోంది. అంటే.. ఒకరకంగా స్థానిక ఎన్నికల్లో చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. అందుకే.. స్థానిక ఎన్నికల వ్యవహారాన్ని వైసీపీ స్పందించకపోవడం.. ఎలాంటి లక్ష్యాలు ఇవ్వకపోవడం.. దిశానిర్దేశం చేయకపోవడం వంటివి కనిపిస్తున్నాయని అంటున్నారు.