శృంగ‌వ‌ర‌పుకోట‌.. ఫ‌టాఫ‌ట్ పాలిటిక్స్‌.. !

admin
Published by Admin — April 15, 2026 in Politics, Andhra
News Image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గం ప్రస్తుతం టిడిపిలో హాట్‌ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఇక్క‌డ‌ నుంచి విజయం సాధించిన కోళ్ల లలిత కుమారి(Kolla Lalitha Kumari)పై విమర్శలు వస్తుండడం, దీనికి సంబంధించి పలు ప్రధాన పత్రికల్లో వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో టిడిపి నాయకులు అలర్ట్ అయ్యారు. స్థానికంగా జరుగుతున్న అంశాలపై పార్టీ అధిష్టానానికి నివేదిక కూడా అందించినట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో జరుగుతున్న అధికారుల అవినీతి తారస్థాయిలో ఉండడం దీనిపై పెద్ద ఎత్తున కొన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు కూడా రావడం వంటివి ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు వచ్చేలా చేస్తోంది.

దాదాపు 20 నుంచి 30 ఎకరాల భూమి విషయంలో జరిగిన అవినీతిలో ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందన్న ఆరోపణలు వంటివి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు రైతులు ఇటీవల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను టార్గెట్ చేసుకొని విమర్శలు గుర్తించారు. దీనికి తోడు ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు తాసిల్దారులు ఇటీవల ఏసీబీ(ACB) దాడుల్లో పట్టుబడ్డారు. వారి నుంచి లక్షల రూపాయల్లో అవినీతి సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఎవరూ కూడా ఎమ్మెల్యే పై నేరుగా విమర్శలు చేయనప్పటికీ దీని వెనుక ఎమ్మెల్యే పాత్ర ఉందన్న విషయంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంఆర్ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంపై పార్టీ నాయకులు ఇటీవల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్(Palla Srinivas)కు కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వ్యవహార శైలి కారణంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అంతే కాదు ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ఆయనకు అందించారు. ఈ పరిణామాలతో అసలు శృంగవరపుకోట(Srungavarapukota) నియోజకవర్గంలో ఏం జరుగుతోందనే విషయంపై పార్టీ ఇప్పుడు ఆరా తీస్తోంది. అవినీతి అక్రమాల వంటి వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు అని తరచుగా పార్టీ చెబుతున్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేల పనితీరు మారకపోవడం పట్ల పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే కోళ్ల ల‌లిత‌ కుమారిని పిలిచి చర్చించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామాలు పార్టీ అధిష్టానానికి మరో ఇబ్బందికర అంశంగా మారాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు దారి తప్పారు. వారిని సరి చేసే విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇటువంటి సమస్యలు వస్తే ఎట్లా అనేది చంద్రబాబు(Chandrababu) చెబుతున్న మాట. మరి ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.

Tags
Srungavarapukota AP Politics Andhra Pradesh TDP MLA Kolla Lalitha Kumari
Recent Comments
Leave a Comment

Related News