వైసీపీ తూర్పు పీటముడి వీడేది ఎప్పుడు?

admin
Published by Admin — April 28, 2026 in Politics, Andhra
News Image

ఏదో ఒకటి తేల్చండి మేము పని చేసుకుంటాం ప్రజల మధ్యకి వెళ్తాం. మా దారి మేము చూసుకుంటాం.. అంటూ వైసీపీ(YCP)లో కొంతమంది నాయకులు పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తమకు ఏదో ఒక నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరేవారు కొందరైతే తాము నిర్దేశించుకున్న నియోజకవర్గాన్ని అప్పగించాలని ఆ నియోజకవర్గంలో తాము ఇప్పటినుంచే పని ప్రారంభిస్తామని, ప్రజల మధ్యకు వెళ్తామని చెబుతున్న వారు కొంతమంది ఉన్నారు.

అయితే పార్టీ పరంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏ నాయకుడికి ఫలానా నియోజకవర్గం అంటూ అప్పగించలేదు. దీంతో ఎదురుచూస్తున్న నాయకులు ఒకరకంగా నిరాశలో ఉన్నారు. తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కాక అంతర్మ‌థ‌నం చెందుతున్నారు. ఇలాంటివారిలో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్(Devineni Avinash) ఒకరు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు.. ఓడిపోయారు. మళ్ళీ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతుండగా ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

పైగా ఆ మధ్య పెనమలూరు అసెంబ్లీ నుంచి లేదా విజ‌య‌వాడ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేయాలని అవినాష్ ను కోరినట్టు పార్టీలో చర్చ జరిగింది. దీనికి ఆయన అంగీకరించలేదు. అంతేకాదు తూర్పు నియోజకవర్గం పరిధిలోనే కార్యక్రమాలు చేపడుతు న్నారు. పైగా అవినాష్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. కానీ, ఈయనపై స్పష్టత కనిపించట్లేదు. పార్టీ తరఫున ఎటువంటి హామీ దక్కలేదు. దీనికి కీలక కారణం వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశ(Vangaveeti Asha) రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ మౌనంగా ఉండిపోయారు. అప్ప‌ట్లో దూకుడుగా ఉన్నా.. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఆశ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కానీ వచ్చే ఎన్నికల నాటికి ఆమె వైసీపీలోకి వస్తారని అందుకే తూర్పు నియోజకవర్గం రిజ‌ర్వ్‌ చేసి పెట్టారని ఒక వర్గం నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిలోనూ క్లారిటీ లేదు. ఫలితంగా అటు అవినాష్ పని చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇటు పార్టీ పరంగా ఎవరూ వచ్చే ఎన్నికల్లో నిలబడతారు అన్నది తెలియక కార్యకర్తలు కూడా డోలాయమానంలో ఉన్నారు. వైసీపీ విజయవాడ తూర్పు(Vijayawada East) పీటముడి వీడేది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఈ ప‌రిణామాల న‌డుమ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇబ్బంది ఎదుర్కొంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. ఇలాంటి ప‌రిస్థితి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉంద‌ని, ఇది తాత్కాలిక‌మేన‌ని..త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ని లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు చెప్పారు.

Tags
Vijayawada East YSRCP Devineni Avinash Vangaveeti Asha YS Jagan AP Politics Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News