నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే వెండితెర అద్భుతం `ఆదిత్య 369` మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తొలి టైమ్ ట్రావెల్ చిత్రమిది. హెచ్. జి. వెల్స్ రచించిన నవల `ది టైం మెషీన్` స్పూర్తితో సైన్స్‌ఫిక్షన్ కథాంశానికి హిస్టరీ, లవ్ ట్రాక్, క్రైమ్‌ను జోడించి ఆదిత్య 369 మూవీని రూపొందించారు. హీరోయిన్ గా మోహిని యాక్ట్ చేయగా.. అమ్రీష్ పురి, టినూ ఆనంద్, తరుణ్, సిల్క్ స్మిత తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీగానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో దేవి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. 1991 జూలై 18న రిలీజ్ అయిన ఆదిత్య 369 సంచలన విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలోనే దాదాపు 34 ఏళ్ల తర్వాత ఆదిత్య 369 చిత్రాన్ని 4కె వెర్షన్‌లో మళ్లీ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. నేటి సాంకేతికతకు తగ్గట్లు చిత్రాన్ని ఆధునీకరించి ఏప్రిల్ 11న ఆదిత్య 369 సినిమాను విడుదల చేస్తున్నట్లు శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కాగా, అప్పట్లోనే ఆదిత్య 369 సినిమాకు ఏకంగా రూ. 1.60 కోట్లు ఖర్చుతో నిర్మించారు. 110 రోజులు చిత్రీకరణ చేశారు. లండర్ లో గ్రాఫిక్స్ వర్క్ జరిగింది. ఈ చిత్రంలోని వర్తమాన కాలంలో కృష్ణ కుమార్ గా, భూతకాలంలో శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ విశేషంగా ఆకట్టుకున్నారు.