టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది ఏప్రిల్ 20న 75వ వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా తెదేపా నేతలు, కార్యకర్తలు పలు చోట్ల అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అలాగే అమెరికాలోని మిస్సోరిలో ఎన్నారై టీడీపీ సభ్యులు చంద్రబాబు 75వ వజ్రోత్సవ వేడుకలను అంబరాన్ని అంటేలా చేశారు.
మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌కు చెందిన ఎన్నారై టీడీపీ సభ్యులు సురేన్ పాతూరి, కిషోర్ యరపోతినేని, వేణు చెంచు మరియు కిషోర్ యార్లగడ్డ చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక గొప్ప వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మిస్సోరిలోని సెయింట్ లూయిస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు.
మహిళలు మరియు పిల్లలు సహా 400 కంటే ఎక్కువ మంది ఎన్నారై టీడీపీ కుటుంబ సభ్యులు చంద్రబాబు 75వ జన్మదినోత్సవం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన అద్భుతమైన విజయాలు మరియు పురోగతిని ప్రతి ఒక్కరూ ప్రతిబింబించడంతో కార్యక్రమం ఎంతో కోలాహలంగా మారింది. అలాగే ఈ కార్యక్రమంలో చిన్నారులు, ఎన్నారై టీడీపీ సభ్యులు కలిసి చంద్రబాబు జీవితం మరియు సేవ యొక్క ప్రతి ప్రభావవంతమైన సంవత్సరాన్ని సూచించే 75 పౌండ్ల కేక్‌ను కట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.