దేశవ్యాప్త రాజకీయాల్లో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. వ్యవహారంపై ఒక వైపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ పార్టీకి సంబంధించిన `ఎక్స్` ఖాతాను దేశంలో నిలిపివేశారు. కేవలం నాలుగైదు రోజుల్లోనే ఎక్స్ ఖాతా ను నిలిపివేయడంపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే.. ఏమీ ఆశ్చర్యపోలేదు. ఇది.. తాము ఊహించిందే నని పేర్కొన్నారు.
అందుకే.. తాము మరో ఖాతాను ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకున్నట్టు తెలిపారు. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అనే మరో ఎక్స్ ఖాతాను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ ఖాతాను కూడా దాదాపు 16 వేల మందికిపై గా ఫాలో అవుతున్నట్టు పేర్కొన్నారు. అయితే.. తమ ఎక్స్ ఖాతాను ఎందుకు నిలిపివేశారన్నది తెలియాల్సి ఉందన్న దీప్కే.. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని.. పరిణామాలను తీవ్రంగా ఎదుర్కొంటా మని పేర్కొన్నారు.
మరోవైపు.. ఇన్‌స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ ఖాతామాత్రం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కోటీ 40 లక్ష మంది ఫాలో వర్లు ఉన్నారని దీప్కే ప్రకటించారు. ఇది కేవలం 5 రోజుల్లోనే తమకు లభించిన ఫాలో వర్ల సంఖ్య గా ఆయన పేర్కొన్నారు. అదేసమయంలో వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించినట్టు వివరించారు. తమ సీజేపీ కొనసాగుతుందని.. ఎవరూ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
భారీ స్పందన..
కాక్రోచ్ జనతా పార్టీకి సోషల్ మీడియాలో అనూహ్య భారీ స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లోనే ఎక్స్ ఖాతాలో 2 లక్షల మంది.. దీనిని మూసి వేసిన తర్వాత.. ప్రారంభించిన మరో ఎక్స్ ఖాతాకు కేవలం గంట వ్యవధిలోనే 16 వేల మంది ఫాలో వర్లు వచ్చారు. ఇక, ఇన్ స్టాలో ఈ సంఖ్య కోటి మందిని దాటి పోయి పరుగులు పెడుతుండడం విశేషం.