ప్రపంచాన్ని వణికించే ప్రాణాంతక ‘ఎబోలా’ వైరస్ భయాలు ఇప్పుడు భారత్‌ను కూడా తాకాయి. కర్ణాటక రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో ఒక ఎబోలా అనుమానిత కేసు వెలుగుచూడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఆఫ్రికా దేశమైన ఉగాండా నుంచి బెంగళూరు(Bengaluru)కు వచ్చిన 28 ఏళ్ల ఒక మహిళలో ఎబోలా ప్రాథమిక లక్షణాలు కనిపించడం వైద్య ఆరోగ్య శాఖను ఉలిక్కిపడేలా చేసింది.
సదరు మహిళ ఎబోలా(Ebola) తీవ్రంగా వ్యాపిస్తున్న ప్రభావిత ప్రాంతం నుండి ప్రయాణించి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆమెలో ఒళ్లు నొప్పులు వంటి తేలికపాటి లక్షణాలు కనిపించడంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా ఆమె బస చేసిన హోటల్ నుండి బెంగళూరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల బృందం నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు. ఆమె శరీరం నుండి సేకరించిన నమూనాలను అత్యంత వేగంగా పూణేలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ' (NIV) ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపారు. నిబంధనల ప్రకారం మరోసారి కూడా పరీక్షలు చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతానికి రిపోర్టుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఇకపోతే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాలలో 'బండిబుగ్యో' అనే ప్రమాదకర ఎబోలా స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తూ మరణాలకు కారణమవుతోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. అటు ఆఫ్రికా సీడీసీ కూడా ఖండాంతర భద్రత ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించింది.
భారతదేశంలో ఇప్పటివరకు ఈ బండిబుగ్యో ఎబోలా రకానికి చెందిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం(Central Govt) స్పష్టం చేస్తూనే, ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారతీయులు ఎవరూ అత్యవసరమైతే తప్ప... డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలు చేయవద్దని కేంద్రం తన అడ్వైజరీలో గట్టిగా సూచించింది. బెంగళూరు కేసు రిపోర్ట్ నెగెటివ్ రావాలని కోరుకుంటూనే, విమానాశ్రయాల్లో నిఘాను మరింత కఠినతరం చేశారు.