తెలుగు దేశం పార్టీ(టీడీపీ) ఏటా నిర్వహించే మహానాడు బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఈ సారి మహానాడును పొదుపు చర్యల్లో భాగంగా ఆన్‌లైన్‌లో(హైబ్రిడ్ విధానం)నే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. ఎక్కడా ఎలాంటి లోపాలు రాకుండా.. ప్రత్యక్ష విధానంలో ఎలా అయితే జరుగుతుందో అచ్చం అలానే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్‌లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యకర్తలను ముందుండి నడిపించే బాధ్యతలను ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించారు.
భారీ స్క్రీన్లు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న మహానాడుకు.. భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది కార్యకర్తలను తరలించారు. 20 తీర్మానాలను సిద్ధం చేశారు. వీటిని గురు వారం జరిగే రెండో రోజు మహానాడు కార్యక్రమంలో ఆమోదించుకునేలా ప్లాన్ చేశారు. ముఖ్యంగా.. పార్టీ తరఫున గత వైసీపీ హయాంలో పోరాడి.. ప్రచారం చేసిన కార్యకర్తలను సన్మానించాలని నిర్ణయించారు. అయితే.. నేతలు భారీ ప్రసంగాలు చేయకుండా.. కార్యకర్తల అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం ఇచ్చారు.
సైకిల్ ర్యాలీలు..
విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కార్యకర్తలు, నాయకులు మహా నాడు వేదికల వద్దకు.. పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీలుగా తరలి వచ్చారు. ఒకవైపు ఇంధన పొదుపును పాటి స్తూనే.. మరోవైపు పార్టీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రయత్నించారు. క్లస్టర్ల వారీగా ఇంచార్జ్‌లు అందరనీ సమన్వయం చేసుకుని ముందుకు సాగారు. దాదాపు అందరూ పార్టీ జెండా, పసుపు వర్ణంతో ఉన్న చొక్కాలు, దుస్తులు ధరించి వచ్చారు.
కేంద్ర కార్యాలయంలో..
మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడును పార్టీ జాతీయ అధ్యక్షు డు చంద్రబాబు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొద్దిపాటి నేతలనే ఆహ్వానించా రు. వీరిలో పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. మిగిలిన నాయకులు ఎక్కడికక్కడే కార్యక్రమాలు నిర్వహించేలా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. అదేవిధంగా పార్టీ నాయకులకు కొన్ని నిర్దేశిత పనులను అప్పగించారు. సో.. ఆన్‌లైన్‌లోనే మహానాడును నిర్వహిస్తున్నా.. అదిరిపోయేలా ఏర్పాటు చేయడం గమనార్హం.
మహానాడు సభలో ప్రసంగించిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, కాకపోయినా ఏపీలో టిడిపి తరఫున 33% రిజర్వేషన్లు అమలు చేయాలని తాను ప్రతిపాదిస్తున్నానని లోకేష్ అన్నారు. ఎన్నికల్లో టిడిపి తరఫున మహిళలకు 33% సీట్లు కేటాయించాలని తీర్మానం చేస్తున్నానని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫున మహిళలకు 33% సీట్లు కేటాయించే అవకాశం ఉంది.