పీసీసీ చీఫ్ వర్సెస్ సీఎం రేవంత్.. కట్ చేసినట్లేనా?

admin
Published by Admin — May 28, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఒకప్పుడు చేయి చేయి కలిపి పార్టీని అధికారంలోకి తెచ్చిన శక్తులు.. ఇప్పుడు ఒకరికొకరు చెక్ పెట్టుకునే వ్యూహాల్లో మునిగిపోయాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పట్టుబట్టి, హైకమాండ్‌తో ఫైట్ చేసి మరీ బొమ్మల మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడి పీఠంపై కూర్చోబెట్టారు. రేవంత్ మైండ్ గేమ్‌కు తగ్గట్లుగా నడుచుకుంటూ, అటు ప్రభుత్వం-ఇటు పార్టీ మధ్య పక్కా సమన్వయకర్తగా ఉంటారని భావించిన మహేష్ గౌడ్.. బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే సొంత గూటిలోనే పరాయి వ్యక్తి అయిపోయారా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ట్విస్ట్ ఏంటంటే.. ప్రతిపక్షాల కంటే ఎక్కువగా, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అత్యంత సన్నిహితంగా ఉండే సోషల్ మీడియా విభాగాలు, కొన్ని ప్రధాన మీడియా సంస్థలే ఇప్పుడు పీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేయడం. ఆయనను డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వరుస కథనాలతో ఉతికి ఆరేస్తుండటం వెనుక ఒక పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ ఆశీస్సులు లేనిదే ఆయనకు అనుకూలమైన మీడియా ఇంత ఓపెన్‌గా పీసీసీ చీఫ్‌పై అటాక్ చేసే సాహసం చేయదని, అంటే వీరిద్దరి మధ్య బంధం కట్ అయినట్లేనా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

మహేష్ గౌడ్(Mahesh Kumar Goud) క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన మాస్ లీడర్ కాకపోవడం, కనీసం ఒక కార్పొరేటర్‌గా కూడా గెలవని ట్రాక్ రికార్డ్ ఉండటం ఇప్పుడు ఆయన వ్యతిరేకులకు పెద్ద ఆయుధంగా మారింది. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు గాంధీ భవన్ నిత్యం కార్యకర్తలతో, రాజకీయ దూకుడుతో కళకళలాడేది. కానీ మహేష్ గౌడ్ హయాంలో గాంధీ భవన్ పూర్తిగా వెలవెలబోతోందని క్యాడర్ అసంతృప్తితో ఉంది. దీనికి తోడు, సీఎం లైన్ దాటి కొన్ని కీలక విషయాల్లో మహేష్ గౌడ్ సొంత అజెండాతో వెళ్లడం రేవంత్ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

ముఖ్యంగా వరంగల్ లాంటి జిల్లాల్లో స్థానిక కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలను, రేవంత్ కోటరీని సంప్రదించకుండానే పీసీసీ చీఫ్ కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రచ్చకు దారితీసింది. కొన్ని వివాదాస్పద భూ సెటిల్‌మెంట్లలో ఆయన పేరు నేరుగా వినిపించడం, రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన లీడర్ల ప్రాభవాన్ని తగ్గించేలా మహేష్ గౌడ్ వ్యవహారశైలి ఉండటంతోనే సీఎం సైలెంట్ అయ్యారని అంటున్నారు. తన మాట వినని నాయకుడిపై మీడియా దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్ కన్నెత్తి చూడకపోవడం వెనుక.. ‘నువ్వు రూట్ మార్చకపోతే సీటు మారుతుంది’ అనే పరోక్ష హెచ్చరిక స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల అటాక్, మరోవైపు సొంత పార్టీ పెద్దల పొగబెడుతున్న రాజకీయం మధ్య నలిగిపోతున్న మహేష్ గౌడ్.. ఇప్పుడు పార్టీని నడపడం పక్కన పెట్టి, తన ఉనికిని కాపాడుకునేందుకే చెమటోడుస్తున్నారు.

Tags
CM Revanth Reddy PCC Chief Mahesh Kumar Goud Telangana Politics Congress TelanganaNews
Recent Comments
Leave a Comment

Related News