వైసీపీ అధ్యక్షడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. ఆయన మరెవరో కాదు మర్రి రాజశేఖర్. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న మర్రి రాజశేఖర్.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేయగా.. ఈ జాబితాలో ఇప్పుడు రాజశేఖర్ కూడా చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మర్రి రాజశేఖర్.. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన వైసీపీలోకి చేశారు. 2014 ఎన్నికల్లోనూ మర్రి రాజశేఖర్ కు పరాజయమే ఎదురైంది. అయితే ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీనీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్.. 2018లో జగన్ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో జగన్ చిలకలూరిపేట టికెట్ ను విడుదల రజనికి ఇచ్చి రాజశేఖర్ కు మొండి చెయ్యి చూపించారు. అప్పటి నుంచి మర్రి రాజశేఖర్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. అయితే శాసనమండలికి 2023 మార్చిలో జరిగిన ఎన్నికలకు ఎమ్మెల్యే కోటా నుండి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ కు జగన్ అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా రాజశేఖర్ గెలుపొందారు. కానీ ఇటీవల చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు విడదల రజనికి ఇవ్వడంతో.. అసంతృప్తి చెందిన రాజశేఖర్ పార్టీని వీడినట్లు ప్రచారం జరుగుతోంది.